వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు తరలించిన ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు రైస్ మిల్లర్లను ఆదేశించారు. బుధవారం మందమర్రి మండలం అందుగులపేటలోని వెంకటేశ్వర రైస్ మిల్లును సందర్శించిన ఆయన, నిర్వాహకులకు పలు సూచనలు చేశారు.
కొనుగోలు కేంద్రాల నుండి రైస్ మిల్లులకు చేరిన ధాన్యాన్ని త్వరితగతిన దిగుమతి చేసుకోవాలని, రోజుకు కనీసం 10 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని, అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచుకోవాలని ఆయన సూచించారు.
జైపూర్ మండలం టేకుమట్ల గ్రామంలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్, ఇటీవల కురిసిన వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, సకాలంలో మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతులకు సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు వంటి సదుపాయాలు కల్పించాలని తెలిపారు. రైతు వివరాలను సిస్టంలో నమోదు చేసి, ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును ధృవీకరించాలని, భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను సరిచూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా పరిశీలించాలని సూచించారు.








