ప్రపంచ రక్తదాతల దినోత్సవం సందర్భంగా, సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ (STPP) డిప్యూటీ జనరల్ మేనేజర్ (E&M) శ్రీ డి. పంతుల నాయక్‌కు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శ్రీ శివ ప్రతాప్ శుక్ల చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక 'Institutional Highest Blood Donors Motivator – 2026' అవార్డు లభించింది.
రాజ్‌భవన్‌లో జరిగిన సేవా పురస్కారాల కార్యక్రమంలో, రక్తదాన శిబిరాల నిర్వహణ ద్వారా అధిక మొత్తంలో రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ రక్తనిధికి అందించినందుకు గాను శ్రీ నాయక్‌ను సత్కరించారు. గత పదేళ్లుగా డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా సింగరేణిలో భారీ రక్తదాన శిబిరాలను ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాల ద్వారా వందలాది మంది ఉద్యోగులు, కార్మికులు రక్తదానం చేయడానికి ముందుకు రాగా, సమాజంలో రక్తదానం పట్ల అవగాహన, సేవా భావన పెంపొందించడంలో శ్రీ నాయక్ కీలక పాత్ర పోషించారు. ఆయన స్వయంగా రక్తదానం చేయడంతో పాటు అనేక మందిని ప్రేరేపించారు.
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్న గవర్నర్ శుక్ల, రక్తదాన ఉద్యమానికి శ్రీ నాయక్ చేస్తున్న సేవలను ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, పలువురు కలెక్టర్లు, సామాజిక కార్యకర్తలు పాల్గొన్నారు.











