రాష్ట్రవ్యాప్తంగా 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాఠశాలలు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నాయి. దాదాపు 45 రోజుల వేసవి సెలవుల అనంతరం, పాఠశాలలు విద్యార్థుల సందడితో కళకళలాడనున్నాయి.
పాఠశాలలు తెరుచుకుంటున్న నేపథ్యంలో, బుక్ స్టోర్లలో పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల కొనుగోళ్లు జోరుగా సాగుతున్నాయి. తల్లిదండ్రులకు పుస్తకాలు, యూనిఫాంలు, షూస్, బ్యాగులు, అడ్వాన్స్ ఫీజుల రూపంలో ఆర్థిక భారం పడుతోంది.
మధ్యతరగతి కుటుంబాలు పిల్లల చదువు కోసం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే, అవసరమైన వస్తువులను సమకూర్చుకొని, ఫీజులు చెల్లించి స్కూళ్లకు పంపేందుకు సిద్ధమవుతున్నారు. 'పిల్లల భవిష్యత్తు కోసం మేము ఎంత కష్టమైనా పడతాం' అని పలువురు తల్లిదండ్రులు తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు కూడా నూతన విద్యా సంవత్సరానికి స్వాగతం పలికేందుకు స్కూళ్లను శుభ్రం చేయించి, అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి. ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాంల పంపిణీకి విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
రేపటి నుంచి విద్యాభ్యాసం తిరిగి ప్రారంభం కానుండటంతో విద్యార్థుల్లో నూతన ఉత్సాహం కనిపిస్తోంది.











