ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నాణ్యమైన ధాన్యాన్ని సేకరించాలని, అందుకు అవసరమైన నిబంధనలను తప్పక పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు.
జిల్లాలోని జైపూర్, చెన్నూర్ మండలాల్లోని కొనుగోలు కేంద్రాలను సందర్శించిన అదనపు కలెక్టర్, కొనుగోలు ప్రక్రియను నిశితంగా పరిశీలించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం మద్దతు ధరతో ధాన్యం కొనుగోలు చేస్తుందని, ఈ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు.
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా అవగాహన కల్పించాలని, అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి, సకాలంలో మిల్లులకు తరలించేలా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచనలు జారీ చేశారు.
కొనుగోలు కేంద్రాలలో రైతులకు అవసరమైన సౌకర్యాలు, త్రాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు వంటివి అందుబాటులో ఉంచామని, ధాన్యం కొనుగోలులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని తెలిపారు. రైతులు తాలు, తప్ప, మట్టి గడ్డలు, తేమ లేని ధాన్యాన్ని మాత్రమే తీసుకురావాలని సూచించారు.
రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని సకాలంలో దిగుమతి చేసుకోవాలని, రోజుకు కనీసం 10 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని, అవసరమైతే హమాలీల సంఖ్యను పెంచుకోవాలని మిల్లుల నిర్వాహకులకు సూచించారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాములను కూడా పరిశీలించారు.











