రైతు సంక్షేమంలో భాగంగా చివరి గింజ వరకు వరి ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు, భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద తెలిపారు. గురువారం జిల్లాలోని చెన్నూర్ మండలం బావురావుపేట గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించి, ధాన్యం కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.
ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుందని, కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యాన్ని సేకరించి, రైతుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈసారి వరి దిగుబడి గత ఏడాది కంటే అధికంగా ఉందని, చెన్నూర్, కోటపల్లి ప్రాంతాలలో పంట ఆలస్యంగా వస్తున్నందున, కొనుగోలు ప్రక్రియను జూన్ 15వ తేదీ వరకు కొనసాగిస్తామని ఆయన పేర్కొన్నారు.
గత సీజన్‌తో పోలిస్తే ఈ సీజన్లో ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం పరిమాణం పెరిగిందని, మొత్తం మీద దాదాపు 1 లక్ష 60 వేల మెట్రిక్ టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉందని మంత్రి అంచనా వేశారు. హమాలీల కొరతను అధిగమించడానికి స్థానికులను నియమించడంతో పాటు, ఇసుక లారీలను కూడా ధాన్యం రవాణాకు మళ్లించామని వివరించారు.
కొందరు రైతులను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, పార్టీలకు అతీతంగా రైతుల సంక్షేమం కోసం అందరూ కలిసి రావాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని, చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, చెన్నూర్, జైపూర్ మండలాలలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుందని, అకాల వర్షాల నేపథ్యంలో ధాన్యాన్ని సురక్షితంగా నిల్వ చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో 70 శాతం కొనుగోలు పూర్తయిందని, రానున్న వర్షాలను దృష్టిలో ఉంచుకొని కొనుగోలు ప్రక్రియను త్వరగా పూర్తి చేయడానికి ప్రయత్నిస్తున్నామని, మొక్కజొన్న పంటను కూడా కొనుగోలు చేస్తామని వెల్లడించారు.








