జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ధాన్యం కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. మంగళవారం పలు కొనుగోలు కేంద్రాలను, రైస్ మిల్లులను సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మంగళవారం హాజీపూర్ మండలంలోని శ్రీ రాజరాజేశ్వరి రైస్ మిల్, శ్రీ సాయి మణికంఠ రైస్ మిల్ లను సందర్శించి, ధాన్యం దిగుమతి, నిల్వ ప్రక్రియలను పరిశీలించారు. ఈ సందర్భంగా ధాన్యం నిల్వ, తరలింపులో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు.
లక్షెట్టిపేట మండలంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ గోదాము, ఇటిక్యాల కొనుగోలు కేంద్రాన్ని కూడా కలెక్టర్ సందర్శించారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని, గోనె సంచులు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని సూచించారు.
మంచిర్యాల పట్టణంలోని హనుమాన్ ఆగ్రో ఇండస్ట్రీస్ ను బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ తో కలిసి కలెక్టర్ సందర్శించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని, నిర్దేశిత సమయానికి అనుగుణంగా ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను కోరారు. లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా సమన్వయంతో కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం ద్వారా ఈ సమాచారం జారీ చేయబడింది.












