వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రాజకీయ ప్రేరేపిత వ్యక్తులు చేస్తున్న అసత్య ప్రచారాలను నమ్మవద్దని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ రైతులను కోరారు. జిల్లా యంత్రాంగం కొనుగోలు ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షిస్తోందని ఆయన తెలిపారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ, కొనుగోలు కేంద్రాలలో లారీల కొరత లేదా కొనుగోళ్లలో నిలిచిపోయిన పరిస్థితి లేదని, అవసరానికి అనుగుణంగా అన్ని వసతులు కల్పించబడుతున్నాయని స్పష్టం చేశారు. రైతులు తప్పుడు సమాచారాన్ని నమ్మి ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ సంవత్సరం ఇప్పటివరకు 1 లక్ష 5 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరిగిందని, ఇది గత సంవత్సరాల సగటుతో పోలిస్తే మంచి పురోగతి అని కలెక్టర్ తెలిపారు. మిగిలిన ధాన్యం కొనుగోలు, రవాణా ప్రక్రియను రాబోయే 10-12 రోజులలో పూర్తి చేసేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నట్లు ఆయన వెల్లడించారు.
గతంతో పోలిస్తే ఈసారి కొనుగోలు, రవాణా ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని, రైతుల సమస్యలను పరిష్కరించడానికి రెవెన్యూ, పౌరసరఫరాలు, ఎస్.డబ్ల్యూ.సి. శాఖల అధికారులు నిరంతరం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. రైతుల సంక్షేమానికి యంత్రాంగం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.












