రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్న ధాన్యానికి సంబంధించి, రైతుల ఖాతాలలో నగదు చెల్లింపులను సకాలంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
గురువారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో గల జిల్లా పౌరసరఫరాల శాఖ కార్యాలయాన్ని కలెక్టర్ సందర్శించి, రైతులకు జరుగుతున్న నగదు చెల్లింపు ప్రక్రియను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం రైతు సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ, కొనుగోలు కేంద్రాల ద్వారా నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేసి, మద్దతు ధర చెల్లిస్తోందని తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతులకు సకాలంలో నగదు చెల్లింపులు జరిగేలా చూడాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాలలో రైతుల వివరాలను రిజిస్టర్లలో స్పష్టంగా నమోదు చేయడంతో పాటు, ట్యాబ్ లలో కూడా నమోదు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ విషయంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, సంబంధిత అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకోవాలని సూచించారు.












