రైతు సంక్షేమం కోసం చేపట్టిన ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచాలకులు జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ అధికారులకు సూచించారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తో పాటు పలువురు అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
రాష్ట్ర పౌరసరఫరాల శాఖ సంచాలకులు జి.వి. శ్యాం ప్రసాద్ లాల్ గురువారం మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి. రాములు, జిల్లా పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కిషన్, జిల్లా సహకార అధికారి సత్యనారాయణ, డి.సి.ఎం.ఎస్., రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు, రవాణా గుత్తేదారులతో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమీక్షలో, ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర చెల్లిస్తూ, నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ధాన్యం విక్రయించిన రైతుల ఖాతాలకు నగదు జమ అవుతుందని, ఈ ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా రైతుల వివరాలను ట్యాబ్ లలో నమోదు చేయాలని సంచాలకులు సూచించారు.
ధాన్యం కొనుగోలు, నిల్వ, రైస్ మిల్లులకు తరలింపు, కొనుగోలు కేంద్రాలలో రైతులకు మౌలిక వసతుల కల్పన వంటి అంశాలపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు, హమాలీల అంశంపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు.
సమీక్ష అనంతరం, జైపూర్ మండలం షెట్ పల్లి లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రం, మండల కేంద్రంలోని సుముఖ రైస్ మిల్లు గోదాములను ఆయన సందర్శించి, ధాన్యం దిగుమతి, సి ఎం ఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












