జిల్లాలో ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి, కేటాయించబడిన గోదాములకు తరలించిన ధాన్యం దిగుమతి ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు.
గురువారం జిల్లాలోని జైపూర్ మండలం ఇందారంలోని వరలక్ష్మి, జయలక్ష్మి రైస్ మిల్లులు, సుముఖ గోదామును జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి బ్రహ్మారావు, జిల్లా మేనేజర్ శ్రీకళ, జైపూర్ మండల తహసిల్దార్ వనజా రెడ్డి లతో కలిసి ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి, నిబంధనల మేరకు కొనుగోలు చేస్తోందని తెలిపారు. రైతుల కోసం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
రైతుల వద్ద నుండి కొనుగోలు చేసిన వరి ధాన్యాన్ని కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు, గోదాములకు తరలించడం జరుగుతోందని, అయితే రైస్ మిల్లులకు, గోదాములకు తరలించబడిన ధాన్యం దిగుమతి ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. అవసరం మేరకు హమాలీల సంఖ్యను పెంచుకోవాలని తెలిపారు.
జిల్లాలోని రైతులు ఇబ్బందులు పడకుండా వరి ధాన్యం కొనుగోలు, దిగుమతి ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని, కొనుగోలు చేసిన ధాన్యం రవాణా విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.








