జిల్లా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ, ఆటో ఢీకొనడంతో ముగ్గురు మహిళలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
జిల్లా సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో మృతులను మందమర్రి మండలానికి చెందిన మహిళలుగా గుర్తించారు. లారీ, ఆటో ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద ఘటనపై శక్తి, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతి చెందిన మహిళల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
మృతుల కుటుంబాలకు రూ.25 వేల చొప్పున, తీవ్రంగా గాయపడిన ముగ్గురు క్షతగాత్రులకు రూ.10 వేల చొప్పున తక్షణ ఆర్థిక సాయం అందిస్తానని మంత్రి ప్రకటించారు.
ప్రమాదం జరిగిన వెంటనే మంత్రి జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి, ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన అన్ని వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిని హైదరాబాద్ నుంచి స్వయంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.












