రోడ్డు ప్రమాదాల నివారణకు సమగ్ర చర్యలు చేపట్టాలని, బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్ రెడ్డి సూచించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, గోదావరిఖనిలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి, గోదావరిఖని ఏసీపీ ఎం.రమేష్ ఆధ్వర్యంలో గోదావరిఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రామగుండం సీఐ కృష్ణ కుమార్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్ రావు, పెద్దపల్లి ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, గోదావరిఖని 1 టౌన్, గోదావరిఖని 2 టౌన్, రామగుండం సర్కిల్, పెద్దపల్లి పరిధిలోని బ్లాక్ స్పాట్లు, ప్రమాదకర మలుపులు, కూడళ్లు, రద్దీ ప్రాంతాలు, తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రమాదకర ప్రాంతాల్లో సంబంధిత శాఖల సమన్వయంతో రంబుల్ స్టిక్స్, హెచ్చరిక సైన్ బోర్డులు, ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రహదారులపై భారీ వాహనాల అక్రమ పార్కింగ్‌ను నియంత్రించాలని, రాంగ్‌సైడ్ డ్రైవింగ్‌పై నిఘా పెంచి కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఆటోలు, స్కూల్ వ్యాన్లు, బస్సుల్లో పరిమితికి మించి విద్యార్థులను తరలించకుండా ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, మైనర్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, సిగ్నల్ జంపింగ్ తదితర ట్రాఫిక్ ఉల్లంఘనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలని, వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు అందేలా తగిన సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ మరియు సంబంధిత శాఖలు సమన్వయంతో నిరంతరం చర్యలు చేపట్టి, ప్రజల ప్రాణాలను కాపాడటానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డీసీపీ అధికారులను ఆదేశించారు.












