మంచేరియల్, 2026-07-21
సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోడ్డు భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని, ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. మంగళవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయ భవనంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో రోడ్డు భద్రతకు సంబంధించిన అన్ని చర్యలను సమర్థవంతంగా అమలు చేసి, రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశానికి డి.సి.పి. ఎ.భాస్కర్, అధికారులతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం ప్రతి శాఖ బాధ్యతాయుతంగా పని చేయాలని తెలిపారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై అనుమతించిన లే-బైలు, వే-సైడ్ సౌకర్య కేంద్రాలు మినహా ఇతర ప్రాంతాలలో భారీ, వాణిజ్య వాహనాల పార్కింగ్‌ను పూర్తిగా నిషేధిస్తూ కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దాబాలు, హోటళ్లు, వాణిజ్య సంస్థల సమీపంలో అక్రమంగా నిలిపే భారీ వాహనాల వల్ల ప్రమాదాలు పెరుగుతున్నందున ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని, రహదారులపై ప్రమాదాలకు గురయ్యే బ్లాక్ స్పాట్లను గుర్తించి అక్కడ వీధి దీపాలు, సి.సి. కెమెరాలు, హెచ్చరిక బోర్డులు, రిఫ్లెక్టర్లు, స్పీడ్ కంట్రోల్ చర్యలు, రంబుల్ స్ట్రిప్‌లు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
ఇందారం వంతెన నుంచి గోదావరి వంతెన వరకు వీధి దీపాల ఏర్పాటు, ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ నిర్వహణ, యూ-టర్న్‌ల పున: వ్యవస్థీకరణ, రహదారుల షోల్డర్ల అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని తెలిపారు. రహదారుల పర్యవేక్షణ కోసం అధునాతన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థ, జి.పి.ఎస్. ఆధారిత నిఘా వ్యవస్థలను వినియోగించి ట్రాఫిక్ ఉల్లంఘనలను గుర్తించి ఈ-చలాన్ వ్యవస్థతో అనుసంధానం చేయాలని, అత్యవసర పరిస్థితులలో తక్షణ వైద్య సేవలు అందించేందుకు ప్రతి 75 కిలోమీటర్లకు అంబులెన్స్, రికవరీ వాహనం అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు.
రహదారి హక్కు పరిధిలో కొత్త దాబాలు, వాణిజ్య నిర్మాణాలకు అనుమతులు ఇవ్వకూడదని, ఇప్పటికే ఉన్న అనధికార నిర్మాణాలను తొలగించి రహదారుల భద్రతకు ఆటంకం కలిగించే ఆక్రమణలను నివారించాలని సూచించారు. రహదారుల సమీప భూవినియోగాన్ని నిబంధనల ప్రకారం నియంత్రించి ప్రమాదాలకు దారితీసే పరిస్థితులను అరికట్టాలని అధికారులకు సూచించారు. పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు, గ్రామాలు, పట్టణాలలో రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ట్రాఫిక్ నిబంధనల పట్ల ప్రజలలో బాధ్యత పెంపొందించాలని తెలిపారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని తెలిపారు.
డి.సి.పి. మాట్లాడుతూ, రహదారి భద్రతను మరింత బలోపేతం చేసేందుకు పోలీసు, రవాణా శాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక హైవే సర్వైలెన్స్ బృందాలను ఏర్పాటు చేసి 24 గంటల పర్యవేక్షణ నిర్వహిస్తామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్, అతివేగం, హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఓవర్‌లోడ్ వాహనాలు, అక్రమ పార్కింగ్ వంటి ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై నిరంతర డ్రైవ్‌లు నిర్వహించి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ రాహ్ వీర్ పథకం గురించి ప్రజలలో విస్తృత అవగాహన కల్పించాలని సూచిస్తూ, రోడ్డు ప్రమాద బాధితులను ప్రమాదం జరిగిన తొలి గంటలో సమీప ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడిన వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం, ప్రశంసాపత్రం అందజేస్తుందని తెలిపారు. ప్రమాద బాధితులకు సహాయం చేయడానికి ప్రజలు భయపడకుండా ముందుకు రావాలని, సమయానికి అందించే సహాయం అనేక ప్రాణాలను కాపాడగలదని తెలిపారు.












