క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో అభివృద్ధి పనుల పేరుతో రోడ్డుపైనే భారీగా కంకర, ఇసుక, యాష్‌ను కుప్పలుగా పోయడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. దీనివల్ల విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జవహర్ నగర్ నుండి ఏ జోన్ రైల్వే స్టేషన్‌కు వెళ్లే రోడ్డుపై కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారింది. రోడ్డుపై పోసిన కంకర, యాష్ కుప్పల కారణంగా బైకులు, ఆటోలు కూడా వెళ్లలేని దుస్థితి నెలకొందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల భద్రతపై ఆందోళన
నిత్యం వందలాది మంది పాఠశాల విద్యార్థులు, వారికి మధ్యాహ్నం టిఫిన్ బాక్స్‌లు తీసుకెళ్లే తల్లిదండ్రులు, రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రయాణికులు ఈ దారి గుండానే ప్రయాణిస్తుంటారు. చిన్నపాటి అజాగ్రత్త జరిగినా విద్యార్థులు కిందపడి ప్రమాదాల బారిన పడే అవకాశం ఉందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు ప్రజల విజ్ఞప్తి
ప్రజల సమస్యలను పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కాంట్రాక్టర్‌పై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకోవాలని వార్డు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వెంటనే రోడ్డుపై ఉన్న కంకర, యాష్ కుప్పలను తొలగించి, రాకపోకలకు ఆటంకం లేకుండా చూడాలని కోరుతున్నారు.












