మంచేరియల్, 2026-07-17
రైతుల ఓట్ల ద్వారా కాకుండా నామినేటెడ్ పద్ధతిలో పీఏసీఎస్ ఎన్నికలు నిర్వహించాలనే తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంపై బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ పదవులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు చేపట్టాలని సంఘం అధ్యక్షురాలు, న్యాయవాది పేరం అలేఖ్య డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) ఎన్నికలను రైతుల ఓట్ల ద్వారా కాకుండా, నామినేటెడ్ పద్ధతిలో కాంగ్రెస్ పార్టీ నాయకులకు లబ్ధి చేకూర్చేలా నిర్ణయం తీసుకోవడం పట్ల బీసీ కులాల ఉద్యమ పోరాట సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
ఈ నిర్ణయానుసారంగా నియమించబోయే పీఏసీఎస్ చైర్మన్, డైరెక్టర్ పదవులకు బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ప్రాతిపదికన నియామకాలు చేపట్టాలని సంఘం తెలంగాణ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది శ్రీమతి పేరం అలేఖ్య గారు కోరారు.
కాంగ్రెస్ కార్యకర్తలకు అవకాశం కల్పించాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నామినేటెడ్ పద్ధతిని అనుసరిస్తున్నప్పటికీ, రిజర్వేషన్ల ప్రకారం చైర్మన్, డైరెక్టర్ పదవులకు నియమిస్తే అన్ని కులాల వారికి న్యాయం జరుగుతుందని, వారికి కూడా ఈ పదవులు అందుతాయని అలేఖ్య గారు అన్నారు.
శాసనసభ్యులు కులాల ప్రాతిపదికన ఈ పదవులను నియమించకపోతే, డబ్బు ఉన్నవారికే ఈ పదవులు దక్కే ప్రమాదం ఉందని, అందువల్ల రిజర్వేషన్లు కల్పించి బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయాలని రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నామని అలేఖ్య పేర్కొన్నారు.












