మంచేరియల్, 2026-07-14
సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు నిర్వీర్యం చేశాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఆరోపించారు. సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంచిర్యాల జిల్లాలో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిల వల్లే సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తాడిచెర్ల కోల్ బ్లాక్ ను నేరుగా కేటాయించి కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు.
సింగరేణి భరోసా యాత్రలో భాగంగా రెండో రోజు కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ రామ్ చందర్ రావు మంచిర్యాల జిల్లాకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల అసెంబ్లీ సింగరేణి శ్రీరాంపూర్ ఏరియా SRP-3 మైన్ లో కార్మికులతో నిర్వహించిన సమావేశంలో వారు పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మల్కాజిగిరి ఎంపీ శ్రీ ఈటెల రాజేందర్, ఆదిలాబాద్ ఎంపీ గోడెం నగేష్, బీజేపీఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే శ్రీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ముధోల్ ఎమ్మెల్యే రామ రావు పటేల్, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, ఎమ్మెల్సీ అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ, సింగరేణి సంస్థను కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ స్వలాభం కోసం వాడుకొని నిర్వీర్యం చేశాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు 52 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించాల్సి ఉండటంతో సంస్థ ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిపారు. సింగరేణి సంస్థకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలాంటి బిడ్డింగ్ లేకుండా నేరుగా తాడిచెర్ల కోల్ బ్లాక్ ను కేటాయించిందని, తద్వారా సంస్థకు అండగా నిలిచిందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు.











