మంచేరియల్, 2026-07-20
మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా సోమవారం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం ఎడిటర్ కలువల శ్రీనివాస్ ఈ విషయంలో చొరవ చూపడంతో పాటు, అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ చర్యతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ముఖ్యమైన చౌరస్తాలు, ప్రధాన రహదారులపై రోడ్డు ప్రమాదాలు జరగకుండా సోమవారం స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం ఎడిటర్ కలువల శ్రీనివాస్ ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ చూపి, స్పీడ్ బ్రేకర్లు వెంటనే వేయాలని సూచించారు.
స్పీడ్ బ్రేకర్లు లేకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయాన్ని బదిలీపై వెళ్లిన క్యాతనపల్లి మున్సిపాలిటీ కమిషనర్ మారుతి ప్రసాద్, ఏఈ ఆశ్రిత్ దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా ఐదు లక్షల టెండర్తో కాంట్రాక్టర్ స్పీడ్ బ్రేకర్లు వేయడానికి ఒప్పందం చేసుకున్నారు.
రాజీవ్ చౌక్ లోని నాలుగు దిక్కుల రోడ్లకు, పట్టణంలోని సూపర్ బజార్ చౌరస్తాలో మూడు దిక్కుల రోడ్లకు, ఆదివారం అంగడి బజార్ ప్రాంతం వద్ద మూడు దిక్కుల రోడ్లకు స్పీడ్ బ్రేకర్లు వేశారు. అలాగే భగత్ సింగ్ నగర్ గణేష్ టెంపుల్ నుంచి ప్రధాన రహదారిపై, రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ సమీపంలోని కాకతీయ కాలనీ వద్ద క్రాస్ రోడ్డు ప్రాంతంలో కూడా స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి రోడ్డుకు ఆరు చొప్పున స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడంతో పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ నుంచి తెప్పించిన మిషన్ ద్వారా ఈ స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేశారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఇంజనీర్ సెక్షన్ వర్కింగ్ ఇన్స్పెక్టర్ రాజ్ కుమార్ పర్యవేక్షణలో కార్మికులు స్పీడ్ బ్రేకర్లు వేశారు. మూడు నెలల క్రితం భగత్ సింగ్ నగర్ ప్రధాన రహదారిపై ట్రాక్టర్ ఢీకొని మందమర్రి మహిళ స్పాట్ లోనే మరణించిన సంఘటన అందరికీ తెలిసిందే. స్పీడ్ బ్రేకర్లు లేకపోవడమే ఆ ప్రమాదానికి కారణమని తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం దినపత్రికలో వార్త ప్రచురించింది. ఈ వార్తతో పాటు, ఆ ప్రాంతంలో వెంటనే స్పీడ్ బ్రేకర్లు వేయాలని సంబంధిత అధికారుల దృష్టికి కూడా తీసుకువెళ్లారు.
దీనిపై వెంటనే స్పందించిన మున్సిపాలిటీ కమిషనర్, ఇంజనీర్, ఉద్యోగ సిబ్బందికి తెలంగాణ జర్నలిస్టు ప్రత్యేక సమాచారం దినపత్రికతో పాటు స్థానిక ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుతో ఇకనైనా రోడ్డు ప్రమాదాలు జరగకుండా, రోడ్డు నిబంధనలు పాటిస్తూ స్థానిక ప్రజలు మున్సిపాలిటీ అధికారులకు సహకరించాలని, రాబోయే కాలంలో రామాలయం చౌరస్తా, గద్దరాగడి, ఇతర ప్రాంతాలలో కూడా స్పీడ్ బ్రేకర్లు వేయడానికి అధికారులు కృషి చేయాలని కోరుతున్నారు.












