సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో CISF జవాన్‌గా పనిచేస్తున్న పాదం మహేందర్, తన ఇద్దరు కుమారులను బాక్సింగ్‌లో అత్యున్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. హర్షిత్ పటేల్, సాహిత్ పటేల్ అనే ఈ యువ బాక్సర్లు రాష్ట్రస్థాయిలో వరుస పతకాలు సాధిస్తూ జిల్లాకు గర్వకారణంగా నిలుస్తున్నారు.
తండ్రి పాదం మహేందర్ స్వయంగా జాతీయస్థాయి బాక్సర్. ఆయన తన విధులకు విరామ సమయంలో యువ క్రీడాకారులకు ఉచితంగా బాక్సింగ్ శిక్షణ అందిస్తున్నారు. ఆయన శిక్షణలో ఇప్పటికే 20 మందికి పైగా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించారు. తన కుమారులను కూడా ఈ క్రీడలో ప్రోత్సహిస్తూ, వారి విజయాలకు మార్గదర్శకుడిగా నిలుస్తున్నారు.
పెద్ద కుమారుడు హర్షిత్ పటేల్ ఇప్పటికే స్కూల్ గేమ్స్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయిలో బంగారు పతకం, రాష్ట్రస్థాయిలో రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఇటీవల జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ పోటీల్లో మరో స్వర్ణం సాధించి, సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి ఛాంపియన్‌షిప్‌కు అర్హత సాధించాడు. రాష్ట్రస్థాయి స్వర్ణంపై గురిపెట్టి కఠోర సాధన చేస్తున్నాడు.
చిన్న కుమారుడు సాహిత్ పటేల్ కూడా తన అన్నకు పోటీగా రాణిస్తున్నాడు. జిల్లా స్థాయిలో వెండి పతకం, రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్‌లో వెండి పతకం సాధించాడు. ప్రస్తుతం రానున్న సబ్ జూనియర్ రాష్ట్ర స్థాయి పోటీల కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు.
జైపూర్ ప్రాంతం నుంచి ఎదుగుతున్న ఈ యువ బాక్సర్లకు తగిన ప్రోత్సాహం, ఆధునిక శిక్షణ సదుపాయాలు లభిస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలోనూ రాణించగలరని క్రీడా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. వీరి విజయగాథ జిల్లాలోని యువతకు స్ఫూర్తినిస్తోంది.







