సాధారణ పౌరుల భద్రత, సౌకర్యం దృష్ట్యా రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవనం, అనుమతి లేని డీజే సౌండ్స్ వినియోగంపై విధించిన నిషేధాజ్ఞలను మరో నెలపాటు పొడిగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. ఈ ఉత్తర్వులు 01-06-2026 నుండి 01-07-2026 వరకు అమల్లో ఉంటాయి.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్లలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కొనసాగిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి కొందరు వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ నిషేధాజ్ఞలు 01-06-2026 నుండి 01-07-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు.
అలాగే, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు, చిన్నపిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థుల విద్యాభ్యాసానికి భంగం కలగకుండా భారీ శబ్దంతో కూడిన డీజే సౌండ్స్ వినియోగంపై అమల్లో ఉన్న నిషేధాజ్ఞలను కూడా పొడిగించినట్లు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు కూడా 01-06-2026 నుండి 01-07-2026 వరకు అమల్లో ఉంటాయని, పరిస్థితులను బట్టి కాలపరిమితిని పొడిగించే అవకాశం ఉందని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణకు మైక్ సెట్ అవసరమైతే సంబంధిత డివిజన్ ఏసీపీ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలో రామగుండం పోలీస్ కమిషనరేట్ యాక్ట్–2016లోని సెక్షన్ 7(1), సెక్షన్ 22(1)(a) నుండి(f), సెక్షన్ 22(2)(a),(b), సెక్షన్ 22(3), సిటీ పోలీస్ యాక్ట్ 1348 నం. IX ఫసలీ, సెక్షన్ 30, పోలీస్ యాక్ట్–1861 ప్రకారం 01-06-2026 ఉదయం 6.00 గంటల నుండి 01-07-2026 ఉదయం 6.00 గంటల వరకు సిటీ పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీస్ కమిషనర్ తెలిపారు. ఈ కాలంలో ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, రాస్తారోకోలు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.
నిబంధనలు ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 223, హైదరాబాద్ నగర పోలీస్ చట్టం, 1348 ఫసలీ నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసు శాఖకు అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని పోలీస్ కమిషనర్ కోరారు.











