రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు, నిల్వ, రవాణా ప్రక్రియలను నిర్దేశిత నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు.
ఆదివారం జిల్లాలోని చెన్నూర్ మండలం ఒతుకులపల్లి, ఆస్నాద్, సోమనపల్లి గ్రామాల్లోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను, చెన్నూర్ మండల కేంద్రంలోని గోదామును మండల తహసిల్దార్ మల్లికార్జున్ తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి, రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యాన్ని సేకరిస్తోందని తెలిపారు.
కొనుగోలు ప్రక్రియను ఎలాంటి అవాంతరాలు లేకుండా పారదర్శకంగా, వేగంగా నిర్వహించాలని ఆయన సూచించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించాలని, గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు, తూకం యంత్రాలు, ప్యాడీ క్లీనర్లను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల నుండి సేకరించిన ధాన్యాన్ని గోదాములలో నిల్వ చేయాలని, ధాన్యం నిల్వ, తరలింపులో ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, రైతులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయానికి అనుగుణంగా ధాన్యం ప్రక్రియను వేగవంతం చేయాలని, లక్ష్యాలను త్వరగా పూర్తి చేసే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








