ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో కొంత సమయం వ్యాయామం, యోగాకు కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య సూచించారు.
శనివారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో జిల్లా యువజన క్రీడా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువజన క్రీడా ముగింపు కార్యక్రమానికి హాజరైన ఆయన, ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
మే 18 నుండి 23 వరకు ఫిట్ & యాక్టివ్ తెలంగాణ, మారథాన్, కెరీర్ & స్కిల్ డెవలప్మెంట్, యూత్ లీడర్ షిప్ సమ్మిట్, స్పోర్ట్స్ డే, యూత్ ఫర్ క్లీన్ తెలంగాణ, ఉద్యోగ సాధన వంటి వివిధ అంశాలపై కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు.
ఈ కార్యాచరణలో భాగంగా ప్రజల ఆరోగ్యకర జీవనశైలి, యువతకు ఉద్యోగ అవకాశాలపై అవగాహన కల్పించడం, మాదకద్రవ్యాల నియంత్రణ, నైపుణ్యాభివృద్ధి, ప్లాస్టిక్ రహిత సమాజం వంటి అంశాలపై చర్చలు, పోటీలు, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు అందజేశారు.
అనంతరం చిత్రలేఖనం, క్రీడలు, సాంస్కృతిక ప్రదర్శనలలో ప్రతిభ కనబరిచిన వారికి జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, యువత, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.












