మందమర్రి, ఆగస్టు 4, 2026
జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.
జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో వేగం పెంచి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందేలా సమన్వయంతో కృషి చేయాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మాగార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివేకానంద అన్నారు.
మంగళవారం జిల్లాలోని మందమర్రి మండల కేంద్రంలో గల బి 1 క్యాంపు కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మండల తహసిల్దార్ సతీష్ కుమార్, మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల కమిషనర్లు రాజలింగు, మురళీకృష్ణ, మండల పరిషత్ అభివృద్ధి అధికారి రాజేశ్వర్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ జిల్లాలో సి.ఎస్.ఆర్., డి.ఎం.ఎఫ్.టి. నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అమృత్ 2.0 పథకంలో భాగంగా చెన్నూర్ నియోజకవర్గ పరిధిలో సుమారు 100 కోట్ల రూపాయల వ్యయంతో నీటి ట్యాంకులు, పైప్లైన్ల నిర్మాణ పనులు చేపడుతున్నామని, ప్రతి ఇంటికీ సురక్షితమైన త్రాగునీటిని అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
మందమర్రి ప్రాంతంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి దాదాపు 95 శాతం చెల్లింపులు చేయడం జరిగిందని, మిగిలిన పనులను కూడా వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రజల సౌకర్యార్థం సెంట్రల్ లైటింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా సోలార్ లైటింగ్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు.
అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇళ్లను కేటాయించడం జరుగుతుందని, ప్రతి నియోజకవర్గానికి 3 వేల 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడం జరిగిందని, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారుడికి ఇందిరమ్మ ఇల్లు అందేలా సంబంధిత అధికారులు సమన్వయంతో క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం చేపట్టిన వైకుంఠధామాల నిర్మాణ పనులు సుమారు 50 శాతం పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, కబరస్థాన్ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని ఎంఎన్ఆర్ గార్డెన్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు రాత్రి వేళలలో మెరుగైన రవాణా, భద్రతా సౌకర్యాలు కల్పించే విధంగా లైటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.
నగర అభివృద్ధి నిధులతో మున్సిపల్ పరిధిలో వివిధ అభివృద్ధి పనులతో పాటు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సి.సి. రోడ్లు, మురుగు కాలువల వ్యవస్థ, నీటి ట్యాంకులు, విద్యుత్ స్తంభాలు తదితర మౌలిక వసతుల పనులను చేపడుతున్నామని తెలిపారు. మున్సిపల్, రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, మిషన్ భగీరథ, గ్రామీణ నీటి సరఫరా, గృహ నిర్మాణ శాఖల అధికారులతో ఆయా శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి అందేలా అధికారులు క్షేత్రస్థాయిలో సమన్వయంతో పనిచేయాలని, అభివృద్ధి పనులలో జాప్యం లేకుండా నిర్దేశించిన గడువులోగా పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గుత్తేదారులకు కేటాయించిన పనులను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని, పనుల నాణ్యత విషయంలో రాజీ పడకుండా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.










