మంచేరియల్, ఆగస్టు 5, 2026
మంచిర్యాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న వివిధ రెవెన్యూ పనులు, సీఎంఆర్ బకాయిలు, రీ-సర్వే వంటి కార్యక్రమాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అధికారులను ఆదేశించారు.
మంచిర్యాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్, సాదాబైనామా, భూ భారతి దరఖాస్తులు, రీ-సర్వే పనులు వంటి కార్యక్రమాలను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు.
మంగళవారం తాండూర్ మండలంలోని కార్తికేయ ఇండస్ట్రీస్ రైస్‌మిల్లును రెవెన్యూ ఇన్స్పెక్టర్తో కలిసి పరిశీలించిన ఆయన, సీఎంఆర్ బకాయిల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ సీఎంఆర్‌ను ఎలాంటి జాప్యం లేకుండా వెంటనే పూర్తి చేయాలని మిల్లర్లను ఆదేశించారు.
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ (ఎస్ఎల్ఆర్) ఏ.డి.తో కలిసి తాండూర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి పెండింగ్ సాదా బైనామా, భూ భారతి దరఖాస్తులపై సమీక్ష నిర్వహించారు. సాదా బైనామా, భూభారతి, రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తులను రికార్డులను అనుసరించి, క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు.
రాంపూర్ గ్రామంలో జరుగుతున్న రీ-సర్వే పనుల పురోగతిని తెలుసుకుని, త్వరగా రాంపూర్ రీ-సర్వే ప్రక్రియను పూర్తిచేసి మరో 5 గ్రామాలలో అదనంగా రీ-సర్వే పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు. కార్యాలయంలో పెండింగ్‌లో ఉన్న వివిధ ధ్రువపత్రాల దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి త్వరితగతిన జారీ చేయాలని, అన్ని పెండింగ్ పనులను నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
బెల్లంపల్లి మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి సాదాబైనామా, భూ భారతి దరఖాస్తుల పురోగతిని సమీక్షించారు. పెండింగ్ ధ్రువపత్రాల జారీ ప్రక్రియను వేగవంతం చేసి, పెండింగ్‌లో ఉన్న అన్ని రెవెన్యూ సంబంధిత పనులను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నస్పూర్ తహసీల్దార్‌తో కలిసి నస్పూర్ మండలంలోని తీగల్‌పహాడ్ ఎంఎల్ఎస్ గోదాంను సందర్శించి ఐసీడీఎస్ కేంద్రాలు, పాఠశాలలకు నిత్యావసర సరుకుల సరఫరా పురోగతిని సమీక్షించారు. సంబంధిత డీలర్‌కు ఈ-కేవైసీ ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని ఆదేశించారు. స్టేజ్-2 కాంట్రాక్టర్‌కు సరిపడా వాహనాలను అందుబాటులో ఉంచి, ఐసీడీఎస్ కేంద్రాలు, పాఠశాలలకు సరుకులు సకాలంలో చేరేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.











