మక్తల్, 2026-08-20
ప్రజా జీవితంలో 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరిని, రాష్ట్ర మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో రూ.273 కోట్లతో చేపట్టనున్న 25 అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు.
ప్రజా జీవితంలో 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం పూర్తి చేసుకున్న రాష్ట్ర పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్య, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరిని రాష్ట్ర మంత్రి సీతక్క ఘనంగా సన్మానించారు. గురువారం మక్తల్ పట్టణంలోని ద్వారక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి శ్రీహరికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.
అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ఈ సందర్భంగా మక్తల్ నియోజకవర్గంలో సుమారు రూ.273 కోట్లతో 25 అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. నియోజకవర్గంలోని ఆత్మకూరు, అమరచింత, ఉట్కూర్, నర్వ, కృష్ణ, మాగనూర్, మక్తల్ మండలాల్లో రహదారులు, ఆసుపత్రులు, క్రీడా మైదానాలు, విద్యా సంస్థలు, సాగునీరు, విద్యుత్, గ్రామీణ మౌలిక వసతులు తదితర రంగాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
రాజకీయ ప్రస్థానంపై మంత్రి శ్రీహరి
ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ, 2001 ఆగస్టు 20న తన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైందని, ప్రజల ఆశీర్వాదం, కార్యకర్తల అండదండలతో 25 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్నానని తెలిపారు. నా మాట మన్నించి మక్తల్‌కు వచ్చిన మంత్రి సీతక్కకు హృదయపూర్వక ధన్యవాదాలు. బడుగు, బలహీన వర్గాల కోసం నిరంతరం పోరాడే అక్క సీతక్క. ములుగు నియోజకవర్గానికి ఎలాంటి ప్రాధాన్యతతో నిధులు తీసుకొస్తారో, అదే స్థాయిలో మక్తల్ అభివృద్ధికి కూడా నిధులు అందిస్తున్నారు అని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి వ్యాఖ్యలు
మక్తల్‌కు ఇన్ని నిధులు రావడం సంతోషించాలో.. ఇన్నేళ్లు ఈ ప్రాంతం వెనుకబాటుతనానికి గురైనందుకు బాధపడాలో అర్థం కావడం లేదు. గతంలో మక్తల్‌ను ఎవరూ పట్టించుకోలేదు. నేడు రాష్ట్రంలో కొడంగల్‌తో సమానంగా మక్తల్ అభివృద్ధి చెందే దిశగా అడుగులు వేస్తోంది అని మంత్రి పేర్కొన్నారు. మక్తల్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు కేటాయించి అభివృద్ధి పనులు చేపడుతోందని తెలిపారు. ప్రజల సహకారంతో రాబోయే రెండున్నరేళ్లలో ప్రతి గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నానన్నారు.
కార్యకర్తలే నా బలం: శ్రీహరి
నేను ఎవరికీ భయపడే వ్యక్తిని కాదు. ప్రజల కోసం రోజుకు 18 గంటలు కష్టపడి పనిచేస్తున్నాను. నా బలం, నా బలహీనత కార్యకర్తలే. వార్డు మెంబర్ స్థాయి నుంచి అనేక పదవులు చేపట్టి ఈ స్థాయికి వచ్చాను. నా రాజకీయ జీవితమంతా ప్రజల కోసమే అని మంత్రి శ్రీహరి అన్నారు. మక్తల్‌కు తాను తీసుకొచ్చిన నిధుల్లో ఒక్క అంకె తక్కువైనా రాజకీయాల నుంచి తప్పుకుంటానని మంత్రి శ్రీహరి స్పష్టం చేశారు.










