మక్తల్, 2026-06-05
మారుమూల ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రజల సమస్యలను తన సమస్యలుగా స్వీకరిస్తూ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకుడు వాకిటి శ్రీహరి. ప్రజా జీవితంలో ఆయన అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం ఒక విశిష్ట అధ్యాయంగా నిలుస్తోంది.
మారుమూల ప్రాంతం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి, ప్రజల సమస్యలను తన సమస్యలుగా స్వీకరిస్తూ అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ మంత్రివర్గంలో కీలక బాధ్యతలు చేపట్టిన నాయకుడు వాకిటి శ్రీహరి. ప్రజా జీవితంలో ఆయన అడుగుపెట్టి పాతికేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయన రాజకీయ ప్రస్థానం ఒక విశిష్ట అధ్యాయంగా నిలుస్తోంది. మక్తల్ ప్రాంత ప్రజలతో మమేకమై, వారి కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ వచ్చిన శ్రీహరి రాజకీయ ప్రస్థానం కేవలం పదవుల పరంపర కాదు, ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుంటూ సాగిన నిరంతర ప్రయాణం. గ్రామీణ ప్రాంత సమస్యలు, యువత ఆకాంక్షలు, రైతులు, వెనుకబడిన వర్గాలు, మత్స్యకారులు, పశుపోషకుల సమస్యలపై ఆయన తనదైన శైలిలో స్పందిస్తూ వచ్చారు.
ప్రజలతో మమేకమే ఆయన బలం
రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి ప్రజలతో ప్రత్యక్ష సంబంధానికే శ్రీహరి ప్రాధాన్యత ఇచ్చారు. గ్రామాలు, పల్లెల్లో పర్యటిస్తూ స్థానిక సమస్యలను తెలుసుకోవడం, వాటి పరిష్కారం కోసం అధికార యంత్రాంగంపై ఒత్తిడి తీసుకురావడం ఆయన రాజకీయ శైలిగా మారింది. ఎన్నికల సమయంలో మాత్రమే ప్రజలను కలవకుండా, సాధారణ రోజుల్లోనూ ప్రజలకు అందుబాటులో ఉండటమే తన రాజకీయ బలంగా మలుచుకున్నారు. దీంతో మక్తల్ ప్రాంతంలో ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రజా అనుబంధం ఏర్పడింది.
గెలుపోటములను దాటి.. కొనసాగిన ప్రయాణం
25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదురైనా ఆయన తన లక్ష్యాన్ని విడిచిపెట్టలేదు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సహజమేనని, ప్రజల విశ్వాసమే శాశ్వతమనే భావనతో ముందుకు సాగారు. కార్యకర్తలకు అండగా నిలవడం, ప్రజా సమస్యలపై స్పందించడం, అభివృద్ధి అంశాలను ముందుకు తీసుకెళ్లడం ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని బలోపేతం చేసుకున్నారు.
మక్తల్ నుంచి రాష్ట్ర రాజకీయాల్లోకి
స్థానిక స్థాయి నుంచి ప్రారంభమైన శ్రీహరి రాజకీయ ప్రస్థానం క్రమంగా రాష్ట్ర స్థాయికి విస్తరించింది. ప్రజా ప్రతినిధిగా తన బాధ్యతలను నిర్వహిస్తూ మక్తల్ ప్రాంత అభివృద్ధి కోసం పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. తదనంతరం తెలంగాణ మంత్రివర్గంలో చోటు దక్కించుకొని క్రీడలు, యువజన సేవలు, పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి వంటి కీలక శాఖల బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
యువతకు కొత్త దిశ
రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందనే ఆలోచనతో క్రీడా రంగ అభివృద్ధికి మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడా ప్రతిభను వెలికితీయడం, క్రీడా మౌలిక వసతులను మెరుగుపరచడం, యువతకు అవకాశాలు కల్పించడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నారు. క్రీడలను కేవలం పోటీలకు పరిమితం చేయకుండా యువతలో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలను పెంచే సాధనంగా చూడటం ఆయన విధానంలో కనిపిస్తోంది.












