సింగరేణి కార్మికులకు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కేవలం 34 శాతం వాటాను ఇవ్వడాన్ని ఖండిస్తూ బీజేపీ మంచిర్యాల జిల్లా కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల శ్రమను దోచుకుంటుందని, లాభాల లెక్కల్లో మోసం చేస్తోందని ఆరోపించారు.
గత సంవత్సరం కార్మికులకు 2.50 లక్షల రూపాయలు బోనస్ ఇవ్వగా, ఈ సంవత్సరం కేవలం 1.50 లక్షల రూపాయలు మాత్రమే ఇవ్వడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రఘునాథ్ వెరబెల్లి అన్నారు. సింగరేణి కార్మికులు చెమటోడ్చి కష్టపడి బొగ్గు ఉత్పత్తి చేస్తేనే సంస్థకు లాభాలు వస్తున్నాయని, కానీ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి నిధులను ఇతర ప్రయోజనాలకు వాడుకొని సంస్థకు నష్టం కలిగిస్తోందని ఆరోపించారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సంస్థను ఏటీఎంలా వాడుకుంటున్నాయని తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని ఆయన విమర్శించారు. సింగరేణి లాభాల బోనస్లో తప్పుడు లెక్కలు చూపించి కార్మికులను మోసం చేయడం బీఆర్ఎస్ పార్టీతో ప్రారంభమైందని, దాన్ని కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తోందని అన్నారు.
కార్మికులకు ఇంత నష్టం జరుగుతున్నా, మన పార్లమెంట్లోని ముగ్గురు మంత్రులు, నలుగురు ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రం నోరు మెదపకుండా ఢిల్లీకి వెళ్లి, కేంద్ర ఎన్నికల సంఘం, మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ ధర్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఢిల్లీకి వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్న ఎంపీ, మంత్రి వివేక్, చెన్నూరు అసెంబ్లీలో వల్ల ఓట్లు తొలగించబడిన పదిమందిని చూపించాలని సవాల్ విసిరారు. ప్రక్రియలో మరణించిన, డబుల్, షిఫ్టింగ్ ఓట్లను తొలగిస్తున్నారని తప్ప, ఏ ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగించలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి సంస్థకు వచ్చిన వాస్తవ లాభాల లెక్కలు బయటపెట్టాలని, కార్మికులకు 35 శాతం బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
గోదావరిఖని సభలో కేటీఆర్ కేంద్ర ప్రభుత్వం, కిషన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని, కిషన్ రెడ్డి చొరవ వల్లే ఎన్నో ఏళ్లుగా పర్యావరణ అనుమతులు రాక పెండింగ్లో ఉన్న నైని కోల్ బ్లాక్కు అన్ని అనుమతులు ఇప్పించి సింగరేణి సంస్థకు అప్పగించారని అన్నారు. అదేవిధంగా తాడిచర్ల-2 ప్రాజెక్ట్, మణుగూరు డీప్ సైడ్ బ్లాక్ కూడా కిషన్ రెడ్డి చొరవ వల్లే సింగరేణి సంస్థకు దక్కిందని తెలుసుకొని మాట్లాడాలని కేటీఆర్కు సూచించారు. కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి చొరవతో దేశవ్యాప్తంగా విస్తరించడానికి కృషి చేస్తోందని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో తాడిచర్ల ఓపెన్ కాస్ట్ను ఏఎంఆర్ అనే ప్రైవేట్ సంస్థకు అప్పగించి, సంస్థను దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ది అని, కేటీఆర్ సింగరేణి సంస్థ గురించి మాట్లాడుతూ ఉంటే దయ్యానికి వేదాలు వల్లించినట్లు ఉందని అన్నారు.
సింగరేణి కార్మికులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, సంస్థకు వచ్చిన వాస్తవ లాభాలను ప్రకటించాలని, కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, తుల ఆంజనేయులు, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, కస్తూరి నాగరాజు, పట్టి వెంకట కృష్ణ, కమలాకర్ రావు, ఆకుల అశోక్ వర్ధన్, జయరామ రావు, వైద్య శ్రీధర్, రంగ శ్రీశైలం, కుర్రే చక్రవర్తి, బోయిని దేవేందర్, రామగిరి బనేష్, బూర్ల చిరంజీవి, మహేందర్, తరుణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.












