మంచిర్యాల రాజకీయాల్లో వర్గపోరు తీవ్రమైంది. ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. వారి పద్ధతి మార్చుకోకపోతే కాంగ్రెస్ నుండి జగన్మోహన్రావు వర్గాన్ని బహిష్కరింపజేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు కాంగ్రెస్ ఇంచార్జ్ మంత్రికి, రాష్ట్ర పీసీసీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దగ్గర కుట్ర రాజకీయాలు సాగవని, మిత్రపక్షంతో పాటు ప్రతిపక్షాలు కూడా ఎమ్మెల్యేపై దాడి చేస్తున్నాయని ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు ఆరోపించారు. మంచిర్యాల అభివృద్ధిని శరవేగంగా చేపడుతున్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఈ విషయాలపై మంచిర్యాల నగర మేయర్ మధుకర్, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు తూముల నరేష్, జిల్లా అధ్యక్షులు పూదరి తిరుపతి మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మీడియాతో మాట్లాడారు.
మంచిర్యాల అభివృద్ధిని జీర్ణించుకోలేని మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీ కృష్ణ వర్గ పోరుకు తెరలేపారని, కాంగ్రెస్ కండువా కప్పుకోలేని మంతెన జగన్మోహన్రావు పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర చేస్తున్నారని వారు ఆరోపించారు. దీనిపై అధిష్టానానికి ఫిర్యాదు చేసి, ఈ వర్గాన్ని కాంగ్రెస్ నుండి బహిష్కరించేలా తమ కార్యచరణ ఉంటుందని తెలిపారు. ఎంపీ లాడ్స్ నిధులు కేవలం ఒకటి, రెండు డివిజన్లకు కాకుండా అన్ని డివిజన్ల ప్రజలు ఓటేస్తేనే గెలిచిన ఎంపీగా అందరికీ నిధులు కేటాయించాలని వారు కోరారు.
కార్పొరేషన్లో ఆ వర్గం చేసే కార్యక్రమాలకు మేయర్, డిప్యూటీ మేయర్, ఏఎంసీ చైర్మన్ ఫోటోలను ఫ్లెక్సీలో పెట్టకపోవడం అభ్యంతరకరమని వారు వ్యాఖ్యానించారు. మంత్రి వివేక్, ఎంపీ వంశీ చర్యలపై వారు మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలో లేని 10 ఏళ్లుగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ను బతికించిన ఘనత ప్రేమ్ సాగర్ రావుకే దక్కిందని అన్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క పాదయాత్ర, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మీటింగ్, ఇంద్రవెల్లి సభ వంటి కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ కోసం చేశారని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ సర్పంచులను, కార్పొరేటర్లను భయబ్రాంతులకు గురిచేస్తోందని, ప్రేమ్ సాగర్ రావును ఎదుర్కొనే ధైర్యం లేకనే ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ వర్గ పోరు మంచిర్యాల రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.










