బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లపై వ్యక్తిగత విమర్శలు చేసిన వారిని మంచిర్యాల జిల్లా బీజేపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేని బొలిశెట్టి తిరుపతి, సస్పెండ్ అయిన మడిపల్లి సత్యం చేసిన ఆరోపణలను తిరస్కరించారు.
బీజేపీ పార్టీలో ఎలాంటి బాధ్యతలు లేని బొలిశెట్టి తిరుపతి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన మడిపల్లి సత్యం నిన్న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లపై వ్యక్తిగత విమర్శలు చేశారు. దీనిని ఖండిస్తూ ఈరోజు మంచిర్యాల జిల్లా కార్యాలయంలో మండల అధ్యక్షులు గడ్డం స్వామి రెడ్డి, మంచిర్యాల కార్పొరేషన్ గర్మిళ్ళ జోన్ అధ్యక్షులు అమిరిశెట్టి రాజ్ కుమార్, నస్పూర్ జోన్ అధ్యక్షులు కర్రె చక్రవర్తి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీ ఎదుగుదల కోసం నిరంతరం కృషి చేస్తున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ లపై వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. భూ సెటిల్మెంట్లు చేసేవారితో కుమ్మక్కై, జిల్లాలో బీజేపీ పార్టీ ఎదుగుదలకు కృషి చేస్తున్న నాయకులపై, రాబోయే ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, ప్రతి సమస్యపై పోరాడుతున్న రఘునాథ్ పై, ప్రస్తుతం బీజేపీలో ఎలాంటి పదవిలో లేని బొలిశెట్టి తిరుపతి, పార్టీ నుంచి సస్పెండ్ అయిన మడిపల్లి సత్యం అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని విమర్శించారు.
జాతీయ రహదారి 63 విషయంలో రఘునాథ్, ఎవరికీ నష్టం కలగకుండా లక్షట్టిపేట పట్టణం నుంచి కాకుండా, పట్టణానికి బైపాస్ రోడ్డు నిర్మించాలని కోరారని, అలైన్మెంట్ మార్చాలని ఎక్కడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరలేదని తెలిపారు. జాతీయ రహదారి విషయంలో రఘునాథ్ వ్యాపారుల నుంచి డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలను అవమానించేలా, పాలేరులకు పదవులు ఇస్తున్నారనడం బాధాకరమని అన్నారు. గతంలో తిరుపతికి మండల అధ్యక్ష పదవిని, సత్యంకు మండల ప్రధాన కార్యదర్శి పదవిని అప్పగించి, పార్టీ బాధ్యతలు అప్పచెప్పిన రఘునాథ్ గారిని పాలేరులా అని ప్రశ్నించారు. బొలిశెట్టి తిరుపతి కుమారుడికి గతంలో బీజేపీ యువమోర్చా జిల్లా అధ్యక్షుడిగా, ప్రస్తుతం యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు ఇప్పించిన నాయకుడు రఘునాథ్ గారేనని తెలుసుకోవాలని సూచించారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న రఘునాథ్, వెంకటేశ్వర్ గౌడ్ లపై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అమిరిశెట్టి రాజ్ కుమార్, గడ్డం స్వామి రెడ్డి, కుర్రె చక్రవర్తి, మధువరపు రమణ రావు, బియ్యాల సతీష్ రావు, హనుమండ్ల శ్రీనివాస్, కొట్టే ప్రశాంత్, మెరెడికొండ శ్రీనివాస్, రాజనర్సు, కొంకటి మహేందర్, ఇలవేణి సతీష్, సాగర్, చిందం తిరుపతి, బూర్ల అజయ్, కంపల్లి రవి మరియు తదితరులు పాల్గొన్నారు.












