శంకర్పల్లి సమీపంలో జరిగిన ఘోర క్రేన్ ప్రమాదంలో గాయపడిన వారిని కార్మిక మరియు గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి సోమవారం పరామర్శించారు. ఈ ప్రమాదంలో ఐదుగురు వలస కార్మికులు మృతి చెందగా, 12 మంది గాయపడిన విషయం తెలిసిందే.
మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే కాలె యాదయ్య తో కలిసి ఆసుపత్రికి వెళ్లి, గాయపడిన వారికి అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. వారి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించి, మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులకు సూచించారు.
NCC Limited సంస్థకు చెందిన నిర్మాణ క్రేన్ బలమైన గాలుల కారణంగా షెడ్‌పై కూలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో షెడ్లో ఆశ్రయం పొందుతున్న కార్మికులపై క్రేన్ పడటంతో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఈ దుర్ఘటనపై పూర్తి స్థాయి నివేదికను సమర్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాదానికి గల కారణాలను సమగ్రంగా విచారించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రభుత్వం మృతుల కుటుంబాలకు అండగా ఉంటుందని, వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.






