మంచేరియల్, 2026-06-28
రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం కోసం రజక ఫెడరేషన్ కు రూ. 9 వేల కోట్లు నిధులు కేటాయించాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి డిమాండ్ చేశారు. చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని, ప్రమాదాల్లో చనిపోయిన వారికి రూ. 5 లక్షల బీమా అందించాలని ఆమె కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం రజకుల సంక్షేమం గురించి ఆలోచించి, రజక ఫెడరేషన్ కు రూ. 9 వేల కోట్లు నిధులు కేటాయించి వారి అభ్యున్నతికి పాటుపడాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు చాకలి శ్రీలక్ష్మి అన్నారు. శుక్రవారం పట్టణంలోని రజక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
రాష్ట్ర ప్రభుత్వం చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చేందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి, పార్లమెంటుకు పంపాలని ఆమె డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి ఎస్సీ జాబితాలో చేరుస్తామని అసెంబ్లీలో ప్రస్తావించారని గుర్తు చేశారు.
రజక వృత్తిదారులు బట్టలు ఉతుకుతూ ప్రమాద వశత్తు చనిపోయిన వారికి కార్మిక చట్టం వర్తింపజేసి, రూ. 5 లక్షల బీమా అందించాలని, చాకలి ఐలమ్మ పేరును జనగామ జిల్లాకు నామకరణం చేయాలని, ట్యాంకు బండ్ పై ఐలమ్మ విగ్రహం ప్రతిష్టించాలని ఆమె కోరారు.
వచ్చే నెల 6న హైదరాబాద్ లో జరిగే చాకలి ఎస్సీ సాధన సమితి తొమ్మిదవ వార్షికోత్సవ మహాసభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎస్సీ రిజర్వేషన్ అనేది చాకలి కులస్తుల జన్మహక్కు అని తెలిపారు. ఈ మహాసభకు బీహార్ మాజీ మంత్రి శ్యామ్ రజక్, తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మాదరపు యాదగిరి హాజరవుతున్నారని పేర్కొన్నారు.
మంచిర్యాల పట్టణ రజక సంఘం తమకు సంపూర్ణ మద్దతు తెలియజేయడం ఆనందంగా ఉందని, సంఘాలు వేర్వేరుగా ఉన్నా హక్కుల కోసం అందరూ కలిసి పోరాడాలని సూచించారు. అంతకు ముందు మహాసభకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు.
కార్యక్రమంలో మంచిర్యాల పట్టణ రజక సంఘం అధ్యక్షులు పారుపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి కొత్తకొండ పోషం, కోశాధికారి నస్పూరి పోశం, ఉపాధ్యక్షులు పోచంపల్లి ధర్మయ్య, నల్లూరి మల్లయ్య, ముఖ్య సలహాదారు నేరెళ్ల రమేష్, రజక సంఘం డైరెక్టర్లు, సభ్యులు పాల్గొన్నారు.












