అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పెద్దపల్లిలో విద్యార్థులు, ప్రజలతో కలిసి భారీ అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పెద్దపల్లి డీసీపీ బి.రామ్ రెడ్డి పిలుపునిచ్చారు.
పెద్దపల్లి పట్టణంలో కళాశాల మైదానం నుంచి జెండా చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి నిర్వహించిన అవగాహన ర్యాలీలో పెద్దపల్లి సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నరేష్ పాల్గొన్నారు. అనంతరం జెండా చౌరస్తాలో ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొన్న ఏసీపీ జి.కృష్ణ, యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, లక్ష్య సాధనపై దృష్టి పెట్టాలని సూచించారు. మాదకద్రవ్యాల వ్యసనం వ్యక్తిగత, కుటుంబ, సామాజిక ఆరోగ్యానికి హానికరం అని హెచ్చరించారు.
తెలంగాణ ప్రభుత్వం మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుబడి ఉందని, డ్రగ్స్ వినియోగం, విక్రయం, అక్రమ రవాణా లేదా గంజాయి సాగుకు సంబంధించిన సమాచారాన్ని డయల్-100 లేదా టోల్‌ఫ్రీ నంబర్ 1908కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
డీసీపీ బి.రామ్ రెడ్డి మాట్లాడుతూ, పెద్దపల్లి జిల్లాలో విద్యార్థులకు మాదకద్రవ్యాలపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డ్రగ్స్ వినియోగం కేంద్ర నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వివరించారు. విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి, విద్యాభ్యాసంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని, శారీరక, మానసిక దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. డ్రగ్స్ రహిత లక్ష్య సాధనకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు.












