Ananthapuramu/Yellanur (ప్రజావార్త) జూలై 25
శివ్వారం గ్రామపంచాయతీలో మిషన్ భగీరథ పైపులైన్ అక్రమ వేలంపై విచారణ అనంతరం, ప్రభుత్వ ఆస్తిని ఎవరూ వినియోగించరాదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. గ్రామ ప్రజలు కూడా ఈ పైపులైన్ ను వాడబోమని ఏకగ్రీవంగా తీర్మానించారు.
జైపూర్ మండలంలోని శివ్వారం గ్రామపంచాయతీలో తాగునీటి కోసం గోదావరి నది నుండి ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ పైపులైన్ ను సర్పంచ్ అక్రమంగా వేలం వేశారని వచ్చిన ఫిర్యాదులపై శుక్రవారం విచారణ జరిగింది.
గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) శివ్వారం గ్రామానికి వచ్చి విచారణ చేపట్టారు. అధికారుల బృందంతో కలిసి గోదావరి ఒడ్డున ఉన్న పైపులైన్ ను ప్రత్యక్షంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, అధికారులు మరియు గ్రామ ప్రజల సమక్షంలో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆస్తి అయిన మిషన్ భగీరథ పైపులైన్ ను ఎవరూ వినియోగించరాదని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.
అనంతరం గ్రామ ప్రజలందరూ కూడా ఇకపై ఈ పైపులైన్ ను ఎవరూ వాడబోమని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.
ఈ విచారణకు జిల్లా పంచాయతీ అధికారి డి. వెంకటేశ్వరరావు, EE RWS వెంకటేశ్వర్, Dy.EE RWS కిరణ్, MPDO జి. సత్యనారాయణ, MPO శ్రీపతి బాపు రావు, AE RWS ఎన్. రాజమల్లయ్య, సర్పంచ్ అంజన్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి సృజన, జైపూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు చల్లా విశ్వంబర్ రెడ్డి తో పాటు వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.












