మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక పేద కుటుంబానికి రూ. 1.50 లక్షల ఆర్థిక సహాయం అందజేశారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సీతారాంపల్లికి చెందిన A. వైష్ణవి కుటుంబానికి ఈ సహాయం అందింది.
మంచిర్యాల నియోజకవర్గంలో ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటున్న ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, 09వ డివిజన్ (సీతారాంపల్లి) నివాసి A. వైష్ణవి కుటుంబం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కోసం తక్షణమే ఆర్థిక సహాయం అందించాలని ఆదేశించారు.
శుక్రవారం, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్వయంగా వైష్ణవి నివాసానికి వెళ్లి, వారి కుటుంబ సభ్యులకు రూ. 1,50,000/- (ఒక లక్ష యాభై వేల రూపాయలు) విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా, కుటుంబ సభ్యులతో మాట్లాడి, వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పాటు, వ్యక్తిగతంగా కూడా ప్రజలకు అండగా ఉండటం తన బాధ్యత అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నియోజకవర్గంలో ఎవరైనా కష్టాల్లో ఉంటే, తనను సంప్రదించవచ్చని, వారికి నా వంతు సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు.
ఎమ్మెల్యే అందించిన ఆర్థిక సహాయం తమకు ఎంతో ఉపశమనాన్ని కలిగించిందని, ఆయన చూపిన మానవత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నామని వైష్ణవి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.












