మంచేరియల్, 30-07-2026
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ఏదైనా ఆపద సంభవిస్తే వెంటనే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు. పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీసులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో, రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు కీలక సూచనలు జారీ చేశారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, ఏదైనా ఆపద సంభవిస్తే వెంటనే డయల్-100కు లేదా సమీప పోలీస్ స్టేషన్కు ఫోన్ చేసి సహాయం పొందాలని విజ్ఞప్తి చేశారు.
పెద్దపల్లి, మంచిర్యాల జోన్లలోని పోలీసు యంత్రాంగం ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటుందని, ఎవరైనా ఆపదలో చిక్కుకున్నట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్కు లేదా డయల్-100కు సమాచారం అందించి పోలీసుల సహాయం పొందవచ్చని తెలిపారు. అధికారులు జారీ చేసే సూచనలను తప్పనిసరిగా పాటిస్తూ పోలీసు శాఖకు సహకరించాలని కోరారు.
పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని సూచించారు. ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని కమిషనరేట్ పరిధిలోని డ్యామ్లు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేశారు. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఎవరూ అక్కడికి వెళ్లరాదని హెచ్చరించారు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం తలెత్తకుండా పోలీసు శాఖ తరఫున అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కాలువలు, నదులు, రిజర్వాయర్లు, చెరువుల వద్దకు వెళ్లరాదని, చెట్ల కింద, శిథిలావస్థలో ఉన్న భవనాల్లో లేదా పాడైన నిర్మాణాల వద్ద ఆశ్రయం పొందరాదని సూచించారు. విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తాకరాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ చెరువులు, నాలాలు, డ్యామ్లు, జలపాతాల వద్దకు వెళ్లరాదని, చేపల వేట కోసం కూడా వెళ్లకూడదని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటి నుంచి బయటకు రావాలని మరోసారి నొక్కి చెప్పారు.
స్థానిక రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్అండ్బీ, వైద్య శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వరదల కారణంగా రహదారులు దెబ్బతిన్న లేదా నీట మునిగిన ప్రాంతాల్లో ప్రజలు వెళ్లకుండా ఇరువైపులా బ్యారికేడ్లు, ప్లాస్టిక్ కోన్లు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెరువులు, కుంటలు, అలుగులు, ప్రధాన రహదారులపై ప్రవహిస్తున్న వాగులు, వంకల వద్ద నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ పోలీసు అధికారులు, సిబ్బంది అన్ని జాగ్రత్త చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. వరద నీటి కారణంగా చెరువులు, కుంటలు నిండి కట్టలు తెగిపోయే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ప్రయాణించాలని, వర్షాల కారణంగా రహదారులు దెబ్బతినడం, గుంతలు ఏర్పడి వాటిలో నీరు నిల్వ ఉండడం వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. కల్వర్టులు, చిన్న వంతెనలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో వాహనాలతో వాటిని దాటేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నించరాదని సూచించారు. ఎస్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధంగా ఉంచినట్లు, కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక శిక్షణ పొందిన 30 మంది సిబ్బంది అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్-100కు సమాచారం అందించాలని, పోలీసు సిబ్బంది 24 గంటల పాటు సహాయక చర్యలకు సిద్ధంగా ఉంటారని పోలీస్ కమిషనర్ తెలిపారు.












