హైదరాబాద్, 2026-08-13
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా తెలిపారు. హైదరాబాద్ లో జరిగిన జిల్లా, మండల విద్యాధికారుల శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, విద్యార్థుల నమోదులో మంచిర్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ప్రశంసించారు.
ప్రభుత్వ విద్యా సంస్థలను బలోపేతం చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించడం జరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా అన్నారు. గురువారం హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో గల ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి జిల్లా విద్యాధికారులు, మండల విద్యాధికారుల ఒక్కరోజు శిక్షణ కార్యక్రమానికి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్, ఎస్ సి ఆర్ టి సంచాలకులు జి.రమేష్, ఎ ఎస్ పి డి శ్రీహరి లతో పాటు విద్యార్థుల నమోదులో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు.
విద్యార్థుల నమోదు లక్ష్యాలు
ఈ సందర్భంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ పాఠశాల గత విద్యా సంవత్సరం కంటే 10 శాతం విద్యార్థులను నమోదు చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్లు తెలిపారు. ఈ లక్ష్యాన్ని మంచిర్యాల జిల్లా 96.16 శాతంతో అధిగమించి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఆమె ప్రశంసించారు. సమాజం దిశను మార్చే ప్రభావవంతమైన విద్యావ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని, తద్వారా క్షేత్రస్థాయి ఉపాధ్యాయుడు నుండి జిల్లా విద్యాధికారి వరకు అందరి సమన్వయంతో ప్రణాళికబద్ధంగా విద్యా వ్యవస్థను పటిష్టం చేయడం జరుగుతుందని యోగితారాణా వివరించారు.
మంచిర్యాల జిల్లా అనుభవాలు
మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, జిల్లాలో విద్యా వ్యవస్థ అభివృద్ధిలో అవలంబించిన విధానాలు, చేపట్టిన కార్యక్రమాలు, పాటించిన ప్రత్యేక వ్యూహాలు, నిర్వహించిన వినూత్న కార్యక్రమాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులతో విద్యా శాఖలో నిర్వహిస్తున్న కార్యక్రమాలపై ఒక రోజు అవగాహన కార్యక్రమం నిర్వహించడంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థపై విద్యార్థుల తల్లిదండ్రులలో నమ్మకం పెరిగిందని, మంచిర్యాల జిల్లాలో 4,009 మంది ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరారని తెలిపారు.
నమోదు పెరగడానికి కారణాలు
ప్రీ ప్రైమరీ పాఠశాలలు ప్రారంభించడం, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలల బాలికల వసతి గృహాలలో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో విద్యార్థుల చేరికలు అధికంగా జరిగాయని కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. అంగన్వాడీ సిబ్బందితో సమన్వయం చేసుకోవడం వలన ప్రాథమిక పాఠశాలలు, ప్రీ ప్రైమరీ పాఠశాలలలో నమోదు పెరిగిందని, ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు చేరిన సందర్భంలో యు-డైస్ లో విద్యార్థుల రికార్డు బదిలీ కొరకు చేపట్టిన ప్రత్యేక కార్యాచరణ, పాఠశాల, స్కూల్ కాంప్లెక్స్, మండలాల వారీగా లక్ష్యాలను, బాధ్యతలను కేటాయించి పర్యవేక్షించడంతో పాటు లోపాలను సరిదిద్దడం జరిగిందని ఆయన వివరించారు.











