మంచేరియల్, 2026-07-28
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వరి సాగు కష్టతరంగా మారిన నేపథ్యంలో, రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆర్థికంగా లబ్ధి పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంగళవారం కాసిపేట మండల కేంద్రంలో జరిగిన రాయితీ విత్తనాలు, ఎరువుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఈ మేరకు రైతులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో వరి సాగు కష్టతరమైన నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆర్థికంగా లబ్ది పొందాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం జిల్లాలోని కాసిపేట మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన రాయితీ విత్తనాలు, ఎరువుల పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఆయన ఈ మేరకు సూచనలు చేశారు.
సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా పథకం వర్తిస్తుందని, రైతులు ప్రభుత్వ సూచనలను పాటిస్తూ ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసి ఆర్థికంగా లబ్ధి పొందాలని తెలిపారు. వరి సాగు మినహా తక్కువ నీటి అవసరం గల పంట రకాలను ఎంచుకోవాలని సూచించారు. ఈ క్రమంలో రైతులకు రాయితీ విత్తనాలు, ఎరువులు అందించడం జరుగుతుందని, రైతులు తమ సాగు విస్తీర్ణానికి అనుగుణంగా వీటిని పొందాలని సూచించారు.
మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి అదనపు గదులు, భోజనశాల నిర్మాణ పనులను పరిశీలించారు. పనులు త్వరగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వంటశాలను పరిశీలించి, ఆహారం తయారీ సమయంలో వంట సిబ్బంది శుభ్రత నిబంధనలు పాటించాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించాలని ఆదేశించారు. వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.
తాండూర్ మండలం ద్వారకాపురం గ్రామపంచాయతీలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, మండల తహసిల్దార్ జ్యోత్స్న, ల్యాండ్ సర్వే ఏ.డి. శ్రీనివాస్ లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూముల సర్వే, రీ సర్వేతో భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని, భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా రికార్డులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
గ్రామంలోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారించడం జరుగుతుందని, తద్వారా గ్రామానికి సంబంధించిన భూమి స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములు సైతం నిర్ధారణ అవుతాయని తెలిపారు. పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం అంశాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని, ప్రభుత్వం భూములను ఆక్రమించినట్లయితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే ప్రక్రియ సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్ చేయడం జరుగుతుందని, ఈ క్రమంలో భూ సమస్యలు తలెత్తినట్లయితే న్యాయపరమైన చర్యలకు సులభతరమవుతుందని, మ్యాపింగ్ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
భూములలో కబ్జాదారుల జాబితా తయారు చేయడం జరుగుతుందని, పట్టా భూముల సర్వే అనంతరం రికార్డులను సరి చూసి సర్వే నెంబర్ల ప్రకారం హద్దుల నిర్ధారణ జరుగుతుందని, పట్టాలో ఒక సర్వే నెంబరు, మోకాలో ఒక సర్వే నెంబరు అంశాలపై మ్యాపింగ్ ప్రకారం పకడ్బందీగా చర్యలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. మ్యాపింగ్ తయారు తర్వాత మార్పులు కష్టతరమని, భూములకు సంబంధించి స్పష్టమైన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. భవిష్యత్తు భూ లావాదేవీలకు సంబంధించి మ్యాపులో మార్పులు తప్పనిసరిగా నవీకరించడం జరుగుతుందని, గ్రామంలో దాదాపు 90 శాతం భూములకు శాశ్వత పరిష్కారం జరిగిందని, మిగిలిన భూమి న్యాయస్థానంలో కొనసాగుతున్న వివాదాల తీర్పు అనంతరం పరిష్కారం అవుతుందని తెలిపారు. రీ సర్వే అనంతరం అసలైన అర్హుల పేరిట భూ రికార్డులు ఉంటాయని, నక్షా పకడ్బందీగా రూపొందించడం జరుగుతుందని తెలిపారు.












