మంచేరియల్, 2026-07-17
కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో కొత్తగా నియమితులైన నర్సింగ్ సిబ్బందికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్మిక, గనుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పాల్గొని, 15 ఏళ్ల తర్వాత ఈఎస్ఐలో స్టాఫ్ నర్సులుగా ఎంపికైన 247 మందికి నియామక పత్రాలను అందజేశారు.
కొమరం భీమ్ ఆదివాసీ భవన్లో కొత్తగా నియమితులైన నర్సింగ్ సిబ్బందికి నియామక పత్రాల పంపిణీ కార్యక్రమానికి కార్మిక మరియు గనుల శాఖ మంత్రి శ్రీ డా. జి వివేక్ వెంకటస్వామి, ఉప ముఖ్యమంత్రి శ్రీ మల్లు భట్టి విక్రమార్క హాజరయ్యారు.
15 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈఎస్ఐ (ESI)లో స్టాఫ్ నర్సుల నియామకాలు జరుగుతున్నాయని, ఈ సందర్భంగా 247 మంది స్టాఫ్ నర్సులకు నియామక పత్రాలు అందజేసినట్లు మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క తెలిపారు.
మొత్తం 599 పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, త్వరలోనే మరో 313 మంది వైద్య, పారామెడికల్ సిబ్బంది నియామకాలు కూడా ఉంటాయని వారు పేర్కొన్నారు.
ఈఎస్ఐ ఆస్పత్రుల్లో సిబ్బంది కొరతను పూర్తిగా తొలగిస్తామని మంత్రి వివేక్ అన్నారు. ప్రస్తుతం 20 లక్షల మంది కార్మికులు, 75 లక్షల మంది లబ్ధిదారులకు ఈఎస్ఐ సేవలు అందిస్తోందని తెలిపారు.
రామగుండం, శంషాబాద్, కొత్తగూడెంలలో కొత్తగా ఈఎస్ఐ ఆస్పత్రులు రాబోతున్నాయని, మహబూబ్‌నగర్‌లో 30 పడకల ఈఎస్ఐ ఆస్పత్రిని ఏర్పాటు చేయబోతున్నామని, త్వరలో నాచారంలో ఈఎస్ఐ నర్సింగ్ కాలేజీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
పెండింగ్ బిల్లుల క్లియరెన్స్‌కు రూ.72 కోట్లు విడుదల చేశామని మంత్రి తెలిపారు.
కొత్తగా నియామకమైన నర్సులకు మంత్రి వివేక్ పిలుపునిస్తూ, 'ఉద్యోగం కాదు… సేవగా భావించి పనిచేయాలి' అని సూచించారు. దేశంలోనే అత్యుత్తమ కార్మిక ఆరోగ్య సేవల వ్యవస్థగా ఈఎస్ఐని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు.












