మంచేరియల్, జూలై 23, 2026
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. గురువారం హాజీపూర్ మండలంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి, నిర్మాణ పనులను పరిశీలించారు. అనంతరం లక్షెట్టిపేట సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని, మున్సిపల్ పరిధిలోని అమృత్ 2.0 పనులను కూడా కలెక్టర్ తనిఖీ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం హాజీపూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించి భోజనశాల, అదనపు గదుల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, అన్ని ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో పోషక విలువలతో కూడిన ఆహారం, శుద్ధమైన త్రాగునీటిని అందించాలని ఆదేశించారు. ఉపాధ్యాయులు విధుల పట్ల సమయపాలన పాటించాలని, వర్షాకాలం దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.
మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, తహసిల్దార్ పుష్పలతతో కలిసి ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ నిర్వహణను పరిశీలించారు. ప్రజల నుండి సేకరించిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. బూత్ స్థాయి అధికారులు ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరి వివరాలు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రక్రియ వేగవంతానికి బూత్ స్థాయి ఏజెంట్లు, వాలంటీర్లు, యువత సహకారం తీసుకోవాలని సూచించారు.
భూభారతి, సాదా బైనమా, రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తుల పరిష్కార ప్రక్రియ తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. మండల ప్రజా పరిషత్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి, మండలంలోని గ్రామ పంచాయతీల పనితీరు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై సమీక్ష నిర్వహించారు. గ్రామాలలో పారిశుద్ధ్య నిర్వహణ నిరంతరం చేపట్టాలని, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి నిర్దేశిత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని సూచించారు.
వ్యక్తిగత గృహ మరుగుదొడ్ల నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి, వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, త్రాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, ప్రతిరోజు పనుల పురోగతిని పర్యవేక్షించాలని సూచించారు. ఉద్యోగులు, సిబ్బంది విధులకు సమయపాలన పాటించాలని, గ్రామాలలో అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ కార్యక్రమాల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించకుండా ప్రతి పనిని బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. గ్రామ పంచాయతీలలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలలో నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ, నిర్ణీత గడువులోగా పూర్తి చేసే విధంగా సమన్వయంతో పని చేయాలని సూచించారు.











