మంచేరియల్, 2026-07-23
జిల్లాలో వరి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) బకాయిలను వెంటనే పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. గురువారం ఆయన జన్నారం, దండేపల్లి మండలాల్లోని పలు రైస్ మిల్లులను, తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి, పెండింగ్ సిఎంఆర్, ఎస్ఐఆర్ ప్రక్రియలపై సమీక్షలు నిర్వహించారు.
జిల్లాలో వరి ధాన్యం కస్టమ్ మిల్లింగ్ రైస్ (సిఎంఆర్) బకాయిలను తక్షణమే పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు ఆదేశించారు. గురువారం జిల్లాలోని జన్నారం మండలం పొనకల్ గ్రామంలో గల శ్రీ శివసాయి రాఘవేంద్ర రైస్ మిల్లు, మర్రిగూడ గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్ మిల్లులను, దండేపల్లి మండలం లింగాపూర్లోని శ్రీ కృష్ణ అగ్రో ఇండస్ట్రీస్, పెద్దపేటలోని భవాని ఇండస్ట్రీస్, కన్నెపల్లిలోని వెంకటేశ్వర పీబీఆర్ఎం, రాధాకృష్ణ ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆయా మండలాల తహసీల్దార్లతో కలిసి పరిశీలించి, అధికారులతో సిఎంఆర్ పెండింగ్ అంశంపై సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించిన పెండింగ్ సిఎంఆర్ బియ్యం పురోగతిని సమీక్షించారు. రైస్ మిల్లులలో పెండింగ్లో ఉన్న సిఎంఆర్ను వెంటనే పూర్తి చేసి ప్రభుత్వానికి అప్పగించాలని, నిర్దేశిత గడువులోగా సిఎంఆర్ను పూర్తి చేయని పక్షంలో ఆ ధాన్యాన్ని మెరుగైన పనితీరు కనబరిచే ఇతర రైస్ మిల్లులకు తరలించే చర్యలు తీసుకుంటామని రైస్ మిల్లుల యాజమాన్యాలకు సూచించారు.
అనంతరం జన్నారం, దండేపల్లి తహసీల్దార్ కార్యాలయాలను సందర్శించి ఎస్ఐఆర్ ప్రక్రియ పురోగతిని సమీక్షించారు. సాదాబైనామా, భూ భారతి, రెవెన్యూ సదస్సుల దరఖాస్తుల ప్రస్తుత స్థితిగతులను అధికారులను అడిగి తెలుసుకొని, రికార్డులను అనుసరించి 60 రోజులకు పైగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రాధాన్యతతో పరిష్కరించాలని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న అన్ని పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జన్నారం, దండేపల్లి మండలాల తహసిల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.












