మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావుపై మాజీ మున్సిపల్ చైర్మన్లు ఉప్పలయ్య, సురిమిల్ల వేణు, మాజీ కౌన్సిలర్ సంజీవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, యువజన కాంగ్రెస్ అధ్యక్షులు జలీల్, కార్పొరేటర్ తాళ్ల సంపత్ రెడ్డి, డీసీసీ వైస్ ప్రెసిడెంట్ అర్కాల హేమలత ఈ మేరకు ఒక మీడియా సమావేశంలో మాట్లాడారు.
మంచిర్యాల పట్టణంలోని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన ఈ సమావేశంలో, మాజీ నాయకుల వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. ముఖ్యంగా మాజీ మున్సిపల్ చైర్మన్ ఉప్పలయ్యపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఉప్పలయ్య తన హయాంలో భూకబ్జాలు, బ్లాక్ మెయిలింగ్, వసూళ్ల దందా, గ్రూప్ తగాదాలతో ప్రజలను పీడించారని, 2009లో పేదల కోసం కేటాయించిన 210 ప్లాట్ల విషయంలో ఒక్కో ప్లాట్‌కు రూ.5 వేల చొప్పున డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. ఈ ఆరోపణలపై ఉప్పలయ్య సమాధానం చెప్పాలని జలిల్ డిమాండ్ చేశారు. పేదల స్థలాల్లో కూడా డబ్బులు వసూలు చేసిన వ్యక్తి ఇతరులపై ఆరోపణలు చేయడం విడ్డూరమని విమర్శించారు.
రాజకీయ స్వార్థంతో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. మాజీ కౌన్సిలర్ సంజీవ్, నస్పూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ సురిమిల్ల వేణులకు రాజకీయంగా ఎదగడానికి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సహాయం చేశారని గుర్తు చేశారు. వారు ఎన్నో వ్యసనాలకు బానిసలై, ప్రజల్లో బలం లేని నాయకులుగా మారారని, కొత్తగా ఏదో సాధిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అభిమానులు పాల్గొన్నారు.












