మహిళలు, బాలికలకు భద్రత కల్పించడంలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలని, ఆకతాయిలపై కఠిన చర్యలు తీసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా సూచించారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో జరిగిన సమన్వయ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు వేధింపులు, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం వంటి అంశాలపై అవగాహన కల్పించాలని సూచించారు.
మహిళలు, బాలికలకు భద్రతపై భరోసా కల్పించడంతో పాటు పోలీసులపై నమ్మకాన్ని పెంపొందించడంలో షీ టీమ్స్ కీలక పాత్ర పోషించాలని రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ అంబర్ కిషోర్ ఝా సూచించారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉంటూ, మహిళలను వేధించే ఆకతాయిలపై నిఘా ఉంచాలని ఆయన ఆదేశించారు. అందిన ఫిర్యాదులపై ఆధారాలను సేకరించి, అవసరమైన కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. గురువారం కమిషనరేట్ కార్యాలయంలో షీ టీమ్స్, మహిళలు, పిల్లల రక్షణ, భరోసా కేంద్రాల సేవలపై సంబంధిత అధికారులతో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యంగా 12 నుంచి 18 ఏళ్ల బాలికలకు వేధింపులు, సైబర్ నేరాలు, సామాజిక మాధ్యమాల దుర్వినియోగం, మంచి స్పర్శచెడు స్పర్శ వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
బాధిత మహిళలు, చిన్నారులకు తక్షణ సహాయం అందించడంతో పాటు కౌన్సెలింగ్, వైద్య, న్యాయ, పునరావాస, సంక్షేమ సేవలు అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ సూచించారు. బాధితుల పట్ల సానుభూతి, మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూ వారికి ధైర్యం, భరోసా కల్పించాలన్నారు. బాధితుల ఫిర్యాదులపై కేసుల నమోదు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయరాదని, ఫిర్యాదులో నేరం ఉన్నట్లు తేలితే ముందుగా కేసు నమోదు చేసి అనంతరం దర్యాప్తు చేపట్టాలని ఆదేశించారు. బాధితుల పట్ల అలసత్వం ప్రదర్శించే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు, బాధితులకు నాణ్యమైన కౌన్సెలింగ్, రక్షణ, పునరావాస సేవలు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.
షీ టీమ్స్ సిబ్బంది నిజాయితీ, పారదర్శకత, నిష్పక్షపాతంగా వృత్తిపరమైన విధులు నిర్వహిస్తూ బాధితుల గోప్యతను కాపాడాలని కమిషనర్ సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా పోలీసులను ఆశ్రయించేలా అవగాహన కల్పించాలని, వారి భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అదనపు డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, సీసీఆర్బీ ఇన్స్పెక్టర్ అనిల్, మంచిర్యాల మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, షీ టీమ్ ఎస్ఐలు హైమా, ఉషారాణి, లావణ్య, షీ టీమ్ సిబ్బంది, భరోసా కేంద్రం సభ్యులు పాల్గొన్నారు.












