ఎదుళ్లబందం గ్రామంలో ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న వ్యక్తిని కోటపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ ఆదేశాల మేరకు, టాస్క్ఫోర్స్/నార్కోటిక్స్ ఏసీపీ శ్రీనివాస్ రావు, చెన్నూర్ రూరల్ సీఐ కృష్ణ పర్యవేక్షణలో కోటపల్లి ఎస్ఐ శివనీతి రాజశేఖర్, టాస్క్ఫోర్స్ ఎస్ఐ జె.లక్ష్మణరావు, పోలీసు సిబ్బందితో కలిసి నమ్మదగిన సమాచారం మేరకు ఎదుళ్లబందం గ్రామానికి చెందిన దుర్గం మహేష్ (33), తండ్రి చంద్రయ్య ఇంటి ఆవరణలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటి ఆవరణలో గంజాయి మొక్కలను సాగు చేస్తున్న మహేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడ సాగు చేస్తున్న మూడు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న మొక్కలను వ్యవసాయ శాఖ ఏఈఓ పరిశీలించి అవి గంజాయి మొక్కలేనని నిర్ధారించారు. వీటిలో రెండు మొక్కలు 12 అంగుళాలు, మరో మొక్క 14 అంగుళాల ఎత్తు ఉన్నట్లు ఎస్ఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న మూడు మొక్కల విలువ సుమారు రూ.4,600 ఉంటుందని అంచనా వేశారు. గంజాయి సాగు, విక్రయాలు, రవాణా, వినియోగానికి పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మాదకద్రవ్యాల నిర్మూలనలో భాగంగా అనుమానాస్పద కార్యకలాపాలపై ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్ఐ రాజశేఖర్ సూచించారు.












