మంచేరియల్, 2026-07-24
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. శుక్రవారం నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రీ సర్వే ద్వారా భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని, భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా రికార్డులు నిర్వహించవచ్చని తెలిపారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో భూముల రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నెన్నెల మండలం చిన్న వెంకటాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీనివాస్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, భూముల సర్వే, రీ సర్వేల ద్వారా భూ సమస్యల పరిష్కారం సులభతరం అవుతుందని, భవిష్యత్తులో భూ వివాదాలు లేకుండా రికార్డులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రికార్డులు, మోకా, పట్టాదారుల వివరాలు, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. గ్రామంలోని భూములకు సంబంధించి హద్దులు నిర్ధారించడం ద్వారా గ్రామానికి సంబంధించిన భూమిపై స్పష్టత వస్తుందని, ప్రభుత్వ భూములు కూడా నిర్ధారణ అవుతాయని తెలిపారు.
పట్టా కలిగి ఉండి మోకాపై లేకపోవడం, మోకాపై ఉండి పట్టా కలిగి ఉండకపోవడం వంటి అంశాలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వం భూములను ఆక్రమించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సర్వే ప్రక్రియను సమగ్రంగా నిర్వహించి మ్యాపింగ్ చేస్తామని, ఈ క్రమంలో భూ సమస్యలు తలెత్తినట్లయితే న్యాయపరమైన చర్యలకు సులభతరమవుతుందని, మ్యాపింగ్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
ఈ చర్యలలో భాగంగా సంబంధిత వ్యక్తులకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేస్తామని, న్యాయపరంగా రావాల్సిన భూమి అందుతుందని తెలిపారు. భూములలో కబ్జాదారుల జాబితా తయారు చేయడం జరుగుతుందని, పట్టా భూముల సర్వే అనంతరం రికార్డులను సరిచూసి సర్వే నెంబర్ల ప్రకారం హద్దుల నిర్ధారణ జరుగుతుందని చెప్పారు. పట్టాలో ఒక సర్వే నెంబరు, మోకాలో ఒక సర్వే నెంబరు వంటి అంశాలపై మ్యాపింగ్ ప్రకారం పకడ్బందీగా చర్యలు చేపడతామని, మ్యాపింగ్ తయారు తర్వాత మార్పులు కష్టతరమని, భూములకు సంబంధించి స్పష్టమైన వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. సర్వేయర్లు, ప్రజల సహకారంతో సమస్యల పరిష్కారం వేగవంతం అవుతుందని తెలిపారు.
అంతకుముందు మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ, సాదా బైనమా, భూభారతి, రెవెన్యూ సదస్సులలో అందిన దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలను పరిశీలించారు. భూభారతి, రెవెన్యూ సదస్సులలో వచ్చిన భూ సంబంధిత దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి, రికార్డులను చూసి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాదా బైనమా దరఖాస్తులను నిబంధనలకు లోబడి పరిశీలించి త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ జిల్లాలో దాదాపు 90 శాతం పూర్తయిందని, నిర్ణీత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల వద్ద ఉన్న ఎన్యుమరేషన్ ఫారాలను బూత్ స్థాయి ఏజెంట్ల సమన్వయంతో సేకరించి, బూత్ స్థాయి అధికారులు యాప్‌లో వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని తెలిపారు.












