జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మంచిర్యాలలోని ఆనంద్ నిలయం రెడ్ క్రాస్ సంస్థ వృద్ధాశ్రమంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా లీగల్ అథారిటీ సీనియర్ న్యాయమూర్తి శ్రీమతి కవిత , జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ తో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వృద్ధుల బాగోగులను అధికారులు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల లైన్స్ క్లబ్ సభ్యులు శ్రీ మధుసూదన్ రెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ సభ్యులు శ్రీ మహేందర్ పాల్గొన్నారు. వైద్య శిబిరంలో 25 మంది వృద్ధులకు పరీక్షలు నిర్వహించారు. సీనియర్ న్యాయమూర్తి గారి నేతృత్వంలోని బృందం వయోవృద్ధులకు సంబంధించిన చట్టాలు, హక్కుల గురించి తెలియజేసింది. వయోవృద్ధులను సొంతవారిగా భావించి, వారికి అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని, ముఖ్యంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులలో వారికి సత్వర వైద్య సేవలు, సౌకర్యాలు అందించాలని కోరారు. జిల్లాలో 30 ఏళ్లు పైబడిన వారందరికీ అసంక్రమిత వ్యాధులైన బీపీ, షుగర్ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహించి, మందులు అందజేస్తూ కౌన్సిలింగ్ చేస్తున్నారు. అలాగే, మానవతా దృక్పథంతో తల్లిదండ్రులను చూసుకోవాలని, వారి అవసరాలు తీర్చాలని, వృద్ధులను గౌరవించాలని సూచించారు. వృద్ధులందరికీ ఆశ్రమంలోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ అమన్, డాక్టర్ రమ్య, డాక్టర్ తబియా, జిల్లా వైద్య బృందం, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, నాందేవ్ శ్రీనివాస్, ఆరోగ్య సిబ్బంది, ఆర్బిఎస్కే వైద్యులు డాక్టర్ రజిత, డాక్టర్ రాము, వారి బృందాలు పాల్గొని పరీక్షలు నిర్వహించారు. ముఖ్యంగా, వయోవృద్ధులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని, గ్రామాల్లో వారికి సంబంధించిన పరీక్షలు, కంటి పరీక్షలు, ఇతర వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. జిల్లా లీగల్ అథారిటీ బృందం అవగాహన కల్పించింది. రెండవ రోజు కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్, జిల్లా సంక్షేమ అధికారి ర ఊఫ్, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది, రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ సభ్యులు, లైన్స్ ఇంటర్నేషనల్ మంచిర్యాల్ సభ్యులు పాల్గొన్నారు.











