రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో విద్యాసంస్థల బస్సు డ్రైవర్లు, యాజమాన్యాలకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. డ్రైవర్లు నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని ఏసీపీ హెచ్చరించారు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, గోదావరిఖని సబ్‌డివిజన్ పోలీసులు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల బస్సు డ్రైవర్లు తప్పనిసరిగా రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఏసీపీ ఎం. రమేష్ సూచించారు.
యాజమాన్యాలు నైపుణ్యం కలిగిన డ్రైవర్లను మాత్రమే నియమించుకోవాలని, విద్యార్థులను ఎక్కించే, దించే సమయాల్లో నిర్దేశించిన ప్రదేశాల్లోనే బస్సులను నిలిపివేయాలని సూచనలు చేశారు. అతివేగం, ఓవర్‌టేకింగ్ వంటివి చేయరాదని హెచ్చరించారు.
మద్యం సేవించి వాహనం నడపడం లేదా సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనం నడపడం వంటివి దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు. డ్రైవర్ల తప్పిదాలకు సంబంధిత విద్యాసంస్థల యాజమాన్యాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో రామగుండం సీఐ కృష్ణకుమార్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి, పలువురు ఎస్ఐలు, విద్యాసంస్థల ప్రిన్సిపాళ్లు, బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.












