జిల్లాలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాలలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యతా ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య ఆదేశించారు. బుధవారం నస్పూర్ మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఆయన సందర్శించి, పనుల పురోగతిని పరిశీలించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, నిర్మాణ పనులు నిర్లక్ష్యానికి తావులేకుండా, విద్యార్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాలని సూచించారు. నిర్మాణ సామగ్రి నాణ్యత, భద్రతా ప్రమాణాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. విద్యార్థులకు అందిస్తున్న వసతులు, విద్యా సదుపాయాలు, భోజనం వంటి అంశాలపై ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, క్రమశిక్షణతో చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని విద్యార్థులకు ఆయన సూచించారు. విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఆరోగ్యం, పరిశుభ్రత పట్ల కూడా శ్రద్ధ చూపాలని పిలుపునిచ్చారు.
పాఠశాలలో విద్యార్థుల హాజరు నమోదు, అకడమిక్ రికార్డులు, ఇతర పరిపాలన రికార్డులను పరిశీలించిన అదనపు కలెక్టర్, ఉపాధ్యాయులతో సమావేశమై విద్యార్థుల అభ్యాస స్థాయిలను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
పాఠశాలలో పరిశుభ్రమైన వాతావరణం, క్రమశిక్షణ, నాణ్యమైన బోధనకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన ఆదేశించారు. వంటగది, స్టోర్ రూమ్, తరగతి గదులు, వసతి గదులు, ఇతర సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థినుల సంక్షేమం, భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ప్రత్యేక అధికారి, ఉపాధ్యాయులు, గుత్తేదారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.












