మంచేరియల్, 03-07-2026
మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ తాండూర్లోని మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, కష్టపడి చదివి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని తాండూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ బీసీ వెల్ఫేర్ బాలుర పాఠశాల, తాండూర్‌ను మంచిర్యాల డీసీపీ ఏ. భాస్కర్ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలు, పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులను ఉద్దేశించి డీసీపీ మాట్లాడుతూ, గంజాయి, డ్రగ్స్‌తో పాటు ఇతర మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాల వల్ల వ్యక్తిగత జీవితం, కుటుంబం, సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని, అలాంటి అలవాట్లకు దూరంగా ఉంటూ మంచి భవిష్యత్తు కోసం కృషి చేయాలని అవగాహన కల్పించారు.
విద్యార్థులకు ఏదైనా సమస్య ఎదురైనా లేదా ఇబ్బందులు ఉన్నా వెంటనే ఉపాధ్యాయులు, హాస్టల్ వార్డెన్ లేదా తల్లిదండ్రులకు తెలియజేయాలని సూచించారు. ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పాఠశాల లేదా హాస్టల్ నుంచి వెళ్లిపోవడం వంటి తొందరపాటు నిర్ణయాలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోరాదని హెచ్చరించారు.
కష్టపడి చదువుకోవడం ద్వారానే ఉన్నత విద్యను అభ్యసించి మంచి ఉద్యోగాలు సాధించవచ్చని, తద్వారా ఆర్థికంగా ఎదగడంతో పాటు సమాజంలో గౌరవం, గుర్తింపు పొందవచ్చని తెలిపారు. విద్యార్థులు తమ విజయాలతో తల్లిదండ్రులు, పాఠశాల, స్వగ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఏసీపీ ఎస్.వి. కిరణ్ కుమార్, తాండూర్ సీఐ దేవయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.












