ప్రజా సంక్షేమ పథకాల రూపకల్పనకు జనగణన అత్యంత కీలకమని, 2వ దశ జనాభా గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. శుక్రవారం నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో సాంకేతిక సహాయకులు, ఛార్జ్ అధికారులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు, ముఖ్య ప్రణాళిక అధికారి పాపయ్య, డివైఎస్ఓ రాజేందర్ లతో కలిసి శిక్షణ కార్యక్రమానికి హాజరైన కలెక్టర్ కుమార్ దీపక్, జనగణన కార్యకలాపాలను డిజిటల్ విధానంలో సమర్థవంతంగా నిర్వహించడం, ఖచ్చితమైన సమాచారాన్ని సేకరించడం, ప్రజలకు అందించే సంక్షేమ పథకాల రూపకల్పనకు అవసరమైన గణాంకాలను సిద్ధం చేయడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. జనగణన మొదటి దశలో భాగంగా గృహాల జాబితా తయారీ, గృహాల వివరాలు, కుటుంబ సభ్యుల సంఖ్యకు సంబంధించిన వివరాలను సేకరించడం జరిగిందని, 2వ దశలో ప్రతి కుటుంబానికి సంబంధించి మొత్తం 40 ప్రశ్నల ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించవలసి ఉంటుందని ఆయన వివరించారు. త్రాగునీటి సరఫరా, కిరోసిన్ వినియోగం, పక్కా ఇళ్ల వివరాలు తదితర అంశాలపై ఖచ్చితమైన సమాచారాన్ని నమోదు చేయాలని, సేకరించిన సమాచారం ఆధారంగా ప్రజల అవసరాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు రూపొందించడంతో పాటు గృహ నిర్మాణం, మౌలిక సదుపాయాలు, ప్రజా సేవల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించవచ్చని తెలిపారు. ప్రతి ఎన్యుమరేటర్కు ప్రశ్నలపై పూర్తి అవగాహన ఉండాలని, ప్రజలకు సందేహాలు ఉంటే నివృత్తి చేస్తూ సరైన సమాచారాన్ని సేకరించాలని కలెక్టర్ సూచించారు. తొలిసారిగా జనగణన ప్రక్రియను డిజిటల్ విధానంలో నిర్వహించడం జరుగుతుందని, ప్రజలు తమ కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో ఎన్యుమరేటర్లు మొబైల్ యాప్ ద్వారా సమాచారాన్ని నమోదు చేయడం జరుగుతుందని, జనాభా గణనకు సంబంధించి వ తేదీని సూచన తేదీగా నిర్ణయించడం జరిగిందని తెలిపారు. జనగణనలో భాగంగా 15 రోజుల పాటు స్వీయ గణనకు అవకాశం కల్పించడం జరుగుతుందని, స్వీయ గణన ద్వారా వివరాలు నమోదు చేసిన వారికి ప్రత్యేకంగా కేటాయించిన ఎస్.ఈ. ఐ.డి. ఆధారంగా ముందుగా నమోదు చేసిన సమాచారాన్ని పరిశీలించవచ్చని, అనంతరం ఎన్యుమరేటర్ సంబంధిత కుటుంబాన్ని సందర్శించి, నమోదు చేసిన వివరాలను ధ్రువీకరించి, అవసరమైన సవరణలు చేస్తారని శిక్షణలో వివరించారు. ఇంటి వద్దకు వెళ్లి వివరాలు సేకరించే ఎన్యుమరేటర్తో పాటు సూపర్వైజర్, ఛార్జ్ అధికారి స్థాయిలో పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. సూపర్వైజర్లు యాదృచ్ఛికంగా 20 శాతం వివరాలను తనిఖీ చేస్తారని, ఛార్జ్ అధికారులు తమ లాగిన్ల ద్వారా సంబంధిత సమాచారాన్ని పరిశీలించి తప్పులను గుర్తించాలని సూచించారు. ఎన్యుమరేటర్లు జనగణనలోని ప్రతి ప్రశ్నను పూర్తిగా అర్థం చేసుకొని, ప్రజలకు స్పష్టంగా వివరించాలని, 15 రోజుల స్వీయ గణన వ్యవధిలో ఎక్కువ మంది ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా అవగాహన కల్పించాలని తెలిపారు. శిక్షణలో ఏవైనా సందేహాలు ఉంటే నివృత్తి చేసుకొని, క్షేత్రస్థాయి విధులను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన విషయాలను పూర్తిగా నేర్చుకోవాలని సూచించారు. జనగణనలో ఇళ్లు లేని వ్యక్తులతో సహా అర్హులైన ప్రతి వ్యక్తి వివరాలు నమోదు అయ్యేలా చూడాలని, పునఃపరిశీలన సమయంలో మరణాలు తదితర మార్పులను నిబంధనల ప్రకారం నవీకరించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో డైరెక్టరేట్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ రాష్ట్ర కన్సల్టెంట్ కె. కృష్ణయ్య, మాస్టర్ ట్రైనర్ శరణ్య లు సాంకేతిక సహాయకులు, ఛార్జ్ అధికారులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.












