మంచేరియల్, 2026-07-26
మంచిర్యాల హమాలివాడలోని కట్ట పోచమ్మ బోనాల జాతర ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. హైదరాబాద్ నుంచి విచ్చేసిన జోగిని నిషా క్రాంతి ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో, బంగారు బోనం సమర్పణతో పాటు సాంప్రదాయ నృత్యాలు, పోతరాజుల విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
మంచిర్యాల హమాలివాడలోని కట్ట పోచమ్మ బోనాల జాతర ఆదివారం అంగరంగ వైభవంగా సాగింది. హమాలివాడ హనుమాన్- సాయిబాబా ఆలయం నుంచి ప్రత్యేక పూజల అనంతరం హైదరాబాద్ నుంచి విచ్చేసిన జోగిని నిషా క్రాంతి ఆధ్వర్యంలో బోనాల జాతర ప్రారంభమైంది.
నల్ల కోటమ్మ-లక్ష్మయ్య ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ బోనాల జాతర 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాస గృహం వరకు కనుల పండగగా సాగింది. అనంతరం నల్ల శంకర్ నివాస గృహంలో జోగిని నిషా క్రాంతి బంగారు బోనాన్ని అందంగా అలంకరించి, పూజలు చేసి, బంగారు బోనంతో కట్ట పోచమ్మ ఆలయం వరకు శోభాయాత్రగా బయలుదేరింది.
ఈ సందర్భంగా బాణాసంచా పేలుళ్ల మధ్య, డప్పుల చప్పుళ్ళు, పోతరాజుల విన్యాసాల మధ్య బంగారం బోనం తలపై ఎత్తుకొని జోగిని నిషా క్రాంతి పూనకాలతో నృత్యాలు చేస్తూ, స్థానిక మహిళల ఎత్తుకున్న బోనాలతో సహా కట్ట పోచమ్మ ఆలయం వరకు వెళ్లింది. ఆలయంలో అమ్మవారికి బంగారు బోనంతో తొలి బోనం సమర్పించగా, స్థానిక మహిళలు తీసుకొచ్చిన బోనాలను సైతం అమ్మవారికి సమర్పించారు.
బోనాల జాతరకు ముఖ్య అతిథిగా మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ హాజరయ్యారు. ఆలయంలో బోనాలు సమర్పించిన అనంతరం ఆమె పూజల్లో పాల్గొన్నారు. బోనాల జాతరలో స్థానిక భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనగా, దాదాపు మూడు గంటలపాటు ఘనంగా సాగింది. జోగిని నిషా క్రాంతి సాంప్రదాయ బోనం నృత్యం తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. యూట్యూబ్ కళాకారులు 300 మంది హాజరై ఆటపాటలతో అలరించారు.
బోనాల అనంతరం 56వ డివిజన్ కార్పొరేటర్ నల్ల శంకర్ నివాస గృహంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాద వితరణలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో డిసిసి మాజీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్, కార్పొరేటర్లు తూముల నరేష్, కంకణాల రోజా శ్యాంసుందర్, పెంట రజిత, సుధమల్ల హరికృష్ణ, వేములపల్లి సంజీవ్, నాయకులు పాల్గొన్నారు.












