బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో దుర్గాదేవి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, ఆర్యవైశ్య మహిళా సంఘం, శ్రీ దుర్గాదేవి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి.
ఉత్సవాల్లో భాగంగా ఉదయం 9:05 గంటల నుండి వేద స్వస్తి, మాంగల్య వాద్యాలతో జ్యోతి ప్రజ్వలన, సంకల్పం, కలశ పూజ, గణపతి పూజ, పుణ్యాహవచనం, పంచగవ్య ప్రాశన, మంటప స్థాపిత పూజలు, శ్రీ మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి కలశ స్థాపన, శ్రీదేవి చతుష్టి ఉపచార పూజలు, అభిషేకం, అర్చన, హారతి, మంత్రపుష్పం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ దుర్గాదేవి ఆగమనాన్ని ఘనంగా జరిపించారు.
పూజా కార్యక్రమాల నిర్వహణ
ఈ పూజా కార్యక్రమాలను ప్రముఖ యాజ్ఞికులు, చండీ ఉపాసకులు శ్రీ రాంబట్ల కార్తీక్ శర్మ ఆధ్వర్యంలో ప్రతిరోజూ నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. సంవత్సరానికి ఒకసారి వచ్చే నవరాత్రులను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి. కోరిన కోర్కెలు తీర్చే చల్లని తల్లి అమ్మవారు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం, మహిళా సంఘం, దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.












